ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) శుక్రవారం ప్రకటించింది. 18 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణలకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఆడిన రెండో టీ20లోనే అర్థశతకంతో సత్తా చాటిన సూర్యకుమార్ వన్డేల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు. క్రునాల్ పాండ్యాతో పాటు భువనేశ్వర్ కుమార్ తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయపడిన పేసర్ షమి, ఆల్‌రౌండర్ జడేజా లు ఇంకా కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిగనలోకి తీసుకోలేదు.
ఇక ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, సంజు శాంసన్‌లు తమ చోటును నిలుపుకోలేకపోయారు. మిగిలిన టీమ్‌లో పెద్దగా మార్పులు లేవు. టీ20 సిరీస్‌కు దూరమైన నటరాజన్ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. పూణె వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే మార్చి 23న జరగనుంది.