భారత జట్టులో చాలా లోపాలు ఉన్నాయి.. పాక్ మాజీ క్రికెటర్ విశ్లేషణ చూస్తే..

ఆసియా కప్ 2025కి ఎంపికైన భారత జట్టును పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ విశ్లేషించారు.

By Medi Samrat
Published on : 25 Aug 2025 3:44 PM IST

భారత జట్టులో చాలా లోపాలు ఉన్నాయి.. పాక్ మాజీ క్రికెటర్ విశ్లేషణ చూస్తే..

ఆసియా కప్ 2025కి ఎంపికైన భారత జట్టును పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ విశ్లేషించారు. భారత జట్టులో చాలా లోపాలు ఉన్నాయని.. వాటిని అధిగమించడం సూర్యకుమార్ నేతృత్వంలోని జ‌ట్టుకు చాలా కష్టమని బాజిద్ ఖాన్ అన్నాడు.

బాజిద్ ఖాన్ పీటీవీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. 'చూడండి.. ఈ ఆటగాళ్లందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు ఒకరిని చూసి అతనికి సామర్థ్యం లేదని చెప్పలేరు. అయితే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జట్టుకు ఎంతో ఎనర్జీని తీసుకువస్తారు.. భారత్ దానిని ఖచ్చితంగా కోల్పోతుందన్నాడు.

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా బాజిద్ ఖాన్ టార్గెట్ చేశాడు. పాకిస్థాన్‌పై సూర్య ప్రదర్శన గురించి మాట్లాడాడు. 'సూర్యకుమార్ యాదవ్ దాదాపు ప్రతి జట్టుపై పరుగులు సాధించాడు, కానీ అతను పాకిస్తాన్‌పై ఆకట్టుకోలేకపోయాడు' అని బాజిద్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్‌పై పోరాడుతున్నట్లు కనిపించాడు. ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కావచ్చు లేదా మరేదైనా కారణం కావచ్చు.. అతనిని సమస్యలు చుట్టుముట్టాయి. సూర్య పాకిస్థాన్‌తో ఐదు T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.. అందులో అతడు 12.80 సగటుతో 64 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు.

అలాగే.. ప్రజలు కోహ్లీ లేదా రోహిత్ గురించి మాట్లాడతారు, కానీ జడేజా జట్టును ఐక్యంగా ఉంచడానికి కృషి చేసే ఆటగాడు. అక్షర్ ఉన్నా.. జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ జ‌ట్టుకు సమతుల్యతను అందిస్తుంది. ఆసియా కప్‌లో ఈ లోపాలను అధిగమించడానికి సరైన టీమ్ కాంబినేషన్‌ను కలిగి ఉండటం భారత్‌కు చాలా ముఖ్యమని బాజిద్ అభిప్రాయపడ్డాడు. సరైన జట్టు కలయికతో పాటు, టైట్‌ మ్యాచ్‌లలో జట్టు చెదిరిపోకుండా ఉండవలసి ఉంటుందని ఆయ‌న‌ చెప్పారు.

Next Story