టీ10 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ విధ్వంసం.. 24 బంతుల్లో సెంచ‌రీ.. తృటిలో 'డ‌బుల్‌' మిస్.!

ఒకప్పుడు బ్యాట్స్‌మెన్‌లు టెస్ట్ క్రికెట్ లేదా వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయడం కోసం కష్టపడేవారు.

By Medi Samrat  Published on  8 Dec 2023 4:15 PM IST
టీ10 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ విధ్వంసం.. 24 బంతుల్లో సెంచ‌రీ.. తృటిలో డ‌బుల్‌ మిస్.!

ఒకప్పుడు బ్యాట్స్‌మెన్‌లు టెస్ట్ క్రికెట్ లేదా వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయడం కోసం కష్టపడేవారు. కానీ ఇటీవలి కాలంలో క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. టీ20, టీ10 ఫార్మాట్లలో కూడా ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు టీ10 వంటి పొట్టి ఫార్మాట్లలో కూడా ఆటగాళ్లు డబుల్ సెంచరీ చేసే అంత దూకుడుగా ఆడుతున్నారు.

T10 ఫార్మాట్‌లో ఒక బ్యాట్స్‌మెన్ ఎలా డబుల్ సెంచ‌రీ స్కోర్ ఎలా చేయగలడని మీరు ఆశ్చర్యపోవ‌చ్చు. కానీ యూరోపియన్ క్రికెట్ లో అటువంటి అరుదైన రికార్డు తృటిలో మిస్ చేసుకున్నాడు ఓ బ్యాట్స్‌మెన్‌. ఆ బ్యాట్స్‌మన్ దూకుడుగా బ్యాటింగ్ చేసి కేవలం 43 బంతుల్లో అజేయంగా 193 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్సు తర్వాత బ్యాట్స్‌మెన్‌ టీ10 క్రికెట్‌లో కూడా డబుల్ సెంచరీ సాధించగలర‌న్న ఆశ మొద‌లైంది.

ఇటీవల యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా మ్యాచ్ కాటలున్యా జాగ్వార్, సోహల్ హాస్పిటల్ జ‌ట్ల మధ్య జరిగింది. జాగ్వార్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు వికెట్ నష్టపోకుండా నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో 257 పరుగులు చేసింది. జాగ్వార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ హమ్జా సలీమ్ దార్ 43 బంతులు ఎదుర్కొని అజేయంగా 193 పరుగులు చేశాడు. హమ్జా ఇన్నింగ్సులో 22 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 449. హమ్జా ధాటికి ప్రత్యర్థి జట్టు హాస్పిటలెట్ బౌలర్ మహమ్మద్ వారిస్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 73 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు. మ‌రో రెండు బంతులు మిగిలివుంటే హమ్జా డ‌బుల్ సెంచ‌రీ పూర్తి చేసేవాడ‌ని అంటున్నారు క్రికెట్ అభిమానులు. హమ్జా 24 బంతుల్లో సెంచ‌రీ చేయడం విశేషం.

258 పరుగుల లక్ష్య ఛేద‌న‌కు దిగిన‌ హాస్పిటలెట్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో జాగ్వార్ జట్టు 153 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

Next Story