దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ను 59 పరుగుల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ U19 పురుషుల ఆసియా కప్ ను డిఫెండ్ చేసుకుంది. గత ఏడాది బంగ్లాదేశ్ మొదటిసారి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఈసారి ఎనిమిది సార్లు ఛాంపియన్ అయిన భారత్ ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. రిజాన్ హొస్సేన్ 65 బంతుల్లో మూడు ఫోర్లతో 47 పరుగులు చేశాడు. మహ్మద్ షిహాబ్ జేమ్స్, ఫరీద్ హసన్ వరుసగా 40, 39 పరుగులు చేశారు.
ఛేజింగ్ లో భారతజట్టు ఓపెనర్లిద్దరూ తొందరగానే పెవిలియన్ చేరారు. ఆండ్రీ సిద్దార్థ్, కార్తికేయ, కెప్టెన్ మొహమ్మద్ అమన్ వరుసగా 20, 21, 26 స్కోర్‌లతో పర్వాలేదనిపించినా ఆ తర్వాత విఫలమయ్యారు. హార్దిక్ 21 బంతుల్లో మూడు ఫోర్లతో 24 పరుగులతో ఆఖర్లో పోరాడినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.