2026లో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను అధికారికంగా ఎంపిక చేసినట్లు ICC ప్రకటించింది. భద్రతా సమస్యలు, క్రికెట్ గవర్నింగ్ బాడీ తమ ఆందోళనలను తగిన పరిష్కారం చూపలేదని పేర్కొంటూ బంగ్లాదేశ్ ICC ఈవెంట్ నుండి వైదొలగాలని నిర్ణయించింది. ICC బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక లేఖ ద్వారా స్కాట్లాండ్ మీ జట్టును భర్తీ చేసిందని తెలియజేసింది.
బంగ్లాదేశ్ భవితవ్యం, టోర్నమెంట్‌లో ఆ జట్టు పాల్గొనడంపై నిర్ణయం తీసుకోవడానికి ICC చైర్మన్ జే షా దుబాయ్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక చివరి ప్రయత్నంగా, బంగ్లాదేశ్ ఈ విషయాన్ని వివాద పరిష్కార కమిటీకి సూచించాలని ICCకి లేఖ రాసింది. అయితే, కమిటీ అప్పీల్ ఫోరమ్‌గా వ్యవహరించలేదు. ICC తుది నిర్ణయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.
ర్యాంకింగ్ ఆధారంగా స్కాట్లాండ్ వరల్డ్ కప్ లో ఆడనుంది. స్కాటిష్ జట్టు 2022, 2024లో జరిగిన చివరి రెండు ఎడిషన్‌లలో టోర్నమెంట్‌లో పాల్గొంది, మంచి ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ సూపర్ 8 దశలకు చేరుకోలేకపోయింది. స్కాట్లాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్‌లతో కలిసి గ్రూప్ సిలోకి ప్రవేశిస్తుంది. స్కాట్లాండ్ తన మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో ఆడనుంది.