రాణించిన మరుఫా అక్తర్.. బంగ్లాదేశ్‌పై భారత్‌కు తొలి వన్డే ఓటమి
Bangladesh hand India first ever ODI defeat. టీ20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్ మహిళల జట్టు వన్డే సిరీస్‌లో పునరాగమనం చేసింది.
By Medi Samrat
టీ20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్ మహిళల జట్టు వన్డే సిరీస్‌లో పునరాగమనం చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టును 40 పరుగుల తేడాతో ఓడించింది. బంగ్లాదేశ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంలో 18 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మరుఫా అక్తర్ కీలక పాత్ర పోషించింది. మరుఫా 7 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ప్రియా పూనియా, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, స్నేహ రాణాలను మరుఫా పెవిలియన్‌కు పంపింది. మరుఫా అక్తర్‌కి కెరీర్‌లో ఇది నాలుగో వన్డే మ్యాచ్. అంతకుముందు ఆడిన మూడు వన్డేల్లో మారుఫా వికెట్ తీయలేకపోయింది. బంగ్లాదేశ్ తరపున 9 టీ20లు ఆడిన మారుఫా.. మొత్తం 9 వికెట్లు తీసింది.
మరుఫా ఒక రైతు కూతురు. తన కఠోర శ్రమతో బంగ్లాదేశ్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది మారుఫా. మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మారుఫా నిలిచింది. మారుఫా 130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలదు. మరుఫా హార్దిక్ పాండ్యా అభిమాని.
ఇదిలావుంటే.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించారు. ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 43 ఓవర్లలో 152 పరుగులు చేసింది. భారత జట్టు కూడా బౌలింగ్ అద్భుతంగా చేసింది. అరంగేట్రం చేసిన అమన్‌జోత్ కౌర్ 4 వికెట్లు, దీప్తి ఒకటి, దేవిక 2 వికెట్లు తీసింది. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత జట్టు 113 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలిసారిగా భారత మహిళల జట్టును ఓడించింది.