గాయంతోనూ రోహిత్ మెరుపులు.. పోరాడి ఓడిన భారత్
Bangladesh beat India by 5 runs take 2-0 lead in series.బంగ్లాదేశ్ పర్యటనలో టీమ్ఇండియాకు ఏదీ కలిసిరావడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 8 Dec 2022 4:51 AM GMTబంగ్లాదేశ్ పర్యటనలో టీమ్ఇండియాకు ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా రెండో వన్డేలోనూ ఓటమి పాలైంది. మొదటి మ్యాచ్‌లో లాగేనా ఈ మ్యాచ్‌లో కూడా గెలుపు ముంగిట భారత్ బోల్తా పడింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2తో కోల్పోయింది.
272 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్ 266/9 స్కోరుకు పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (82; 102 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌పటేల్ (56; 56 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (51 నాటౌట్; 28 బంతుల్లో 3.పోర్లు, 5 సిక్సర్లు) లు అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఎబాదత్ హుస్సేన్ మూడు వికెట్లు, మెహదీ హసన్ మిరాజ్, షకిబ్ అల్‌హసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చేతి వేలిగాయం కారణంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ ఓపెనర్‌గా రాలేదు. జట్టు ఓటమి కోరల్లో చిక్కుకోవడంతో గాయంతో బాధపడుతూనే 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి గొప్పగా పోరాడాడు. చివరి ఓవర్‌లో విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. రెండు, మూడు, ఐదు బంతులకు రోహిత్ వరుసగా 4,4,6 సిక్స్ బాదాడు. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా.. ముస్తాఫిజుర్ చక్కటి యార్కర్ సంధించాడు. దీంతో రోహిత్ భారీ షాట్ ఆడలేకపోయాడు. దీంతో భారత్‌కు నిరాశ తప్పలేదు.
అంతకముందు బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 271/7 స్కోరు చేసింది. ఓదశలో 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాను మెహదీహసన్ మిరాజ్ (100 నాటౌట్; 83 బంతుల్లో 8పోర్లు, 4సిక్సర్లు), మహ్మదుల్లా(77; 96 బంతుల్లో 7ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్ కు 148 పరుగులు జోడించి బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.