అక్క‌డ గెలిచిన జ‌ట్టే.. ఒక్క మార్పుతో భార‌త్‌కూ వ‌స్తున్నారు..!

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సెప్టెంబర్ 19 నుండి టీమ్ ఇండియాతో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది

By Medi Samrat  Published on  12 Sep 2024 9:11 AM GMT
అక్క‌డ గెలిచిన జ‌ట్టే.. ఒక్క మార్పుతో భార‌త్‌కూ వ‌స్తున్నారు..!

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సెప్టెంబర్ 19 నుండి టీమ్ ఇండియాతో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. జట్టు కెప్టెన్సీ నజ్ముల్ హుస్సేన్ శాంటో చేతిలో ఉంటుంది. బంగ్లాదేశ్ జట్టు WTC (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) లో భాగంగా భారత జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం పాకిస్థాన్ సిరీస్‌లో గాయ‌ప‌డ్డాడు. గాయం కారణంగా భారత్‌లో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు దూరమైనట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. పాక్‌లో రెండు టెస్టుల్లోనూ నెగ్గిన బంగ్లాదేశ్ జట్టు కూడా భారత్‌ను కూడా ఎదురుదెబ్బ తీయాలనే ఉద్దేశంతో వస్తోంది. దీంతో పాకిస్థాన్‌ను ఓడించిన జట్టునే దాదాపుగా భార‌త్‌కు పంపుతుంది.

బంగ్లాదేశ్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్ హసన్ జాయ్ పాకిస్థాన్ సిరీస్ నుండి నిష్క్రమించిన తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్‌కు పునరాగమనం చేయ‌నున్నాడు. అతడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. అది నయం కావడానికి రెండు వారాలు పట్టింది. వెన్ను సమస్య కారణంగా షోరిఫుల్ ఇస్లాం భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. రావల్పిండిలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో బాబర్ అజామ్ సహా మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే నడుము గాయం కారణంగా రెండో టెస్టు ఆడలేకపోయాడు.

బంగ్లాదేశ్ జట్టులో జకీర్ అలీ అనిక్ తొలిసారిగా టెస్టు జట్టులోకి వచ్చాడు. 26 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జకీర్ అలీ దేశం తరఫున 17 టీ20 మ్యాచ్‌లు ఆడినా.. టెస్టు జట్టుకు ఎంపికైక‌ ఏకైక అన్‌క్యాప్డ్ ప్లేయర్. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించిన లిటన్ దాస్ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేప‌డుతుండ‌గా.. జకీర్ అలీ అనిక్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులోకి వ‌చ్చాడు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19న చెన్నైలో ప్రారంభం కానుండ‌గా.. రెండో మ్యాచ్ కాన్పూర్‌లో సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ కంటే భారత్ ఏడు స్థానాలు ఆధిక్యంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భార‌త్‌ అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడుతుంది.. ఆపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్తుంది.

బంగ్లాదేశ్ టెస్టు జట్టు:

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, జాకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్. రానా, తైజుల్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్

Next Story