లార్డ్స్‌లో హై-వోల్టేజ్ డ్రామా.. నిర‌స‌న‌కారుడిని ఎత్తుకుని మైదానం బ‌య‌ట‌కు తీసుకెళ్లిన బెయిర్‌స్టో

Bairstow carries protester off field. యాషెస్ సిరీస్-2023లో రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది.

By Medi Samrat  Published on  28 Jun 2023 12:00 PM GMT
లార్డ్స్‌లో హై-వోల్టేజ్ డ్రామా.. నిర‌స‌న‌కారుడిని ఎత్తుకుని మైదానం బ‌య‌ట‌కు తీసుకెళ్లిన బెయిర్‌స్టో

యాషెస్ సిరీస్-2023లో రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది. ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే, మ్యాచ్ ప్రారంభంలో లార్డ్స్‌లో హై-వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. 'జస్ట్ స్టాప్ ఆయిల్'కి మద్దతు ఇస్తున్న ఇద్దరు నిరసనకారులు మిడిల్ గ్రౌండ్‌లోకి ప్రవేశించారు. దీని కారణంగా మ్యాచ్ చాలా సేపు ఆగిపోయింది. జానీ బెయిర్‌స్టో ఒక నిరసనకారుడిని ఎత్తుకుని మైదానం నుండి బయటకు తీసుకెళ్లాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది.

వర్షం అంతరాయం తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. స్టువర్ట్ బ్రాడ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేయడానికి సిద్ధమవుతుండ‌గా 'జస్ట్ స్టాప్ ఆయిల్'కి మద్దతు ఇస్తున్న ఇద్దరు నిరసనకారులు మిడిల్ గ్రౌండ్‌లోకి ప్రవేశించారు. ఆందోళనకారులిద్దరూ మైదానంలో రచ్చ చేయ‌డంతో చాలా సేపు ఆట నిలిచిపోయింది. చాలాసేపు శ్ర‌మించి.. భద్రతా సిబ్బంది ఒక నిరసనకారుడిని పట్టుకోగలిగారు. జానీ బెయిర్‌స్టో మరొకరిని ప‌ట్టుకున్నాడు. బెయిర్‌స్టో నిర‌స‌న‌కారుడిని ఎత్తుకుని మైదానం నుండి బయటికి తీసుకొని వెళ్లాడు.

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఓ మార్పు చేసింది. కంగారూ జట్టు స్కాట్ బోలాండ్ స్థానంలో మిచెల్ స్టార్క్‌ను జట్టులోకి తీసుకుంది. గాయం కారణంగా స్టార్క్ తొలి టెస్టులో ఆడ‌లేదు. స్టార్క్ రాకతో ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్ చాలా బలంగా కనిపిస్తోంది.

ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా ఓ మార్పు చేసింది. గాయపడిన మొయిన్ అలీ స్థానంలో 25 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ జోష్ టాంగ్‌ను తీసుకుంది. టోంగ్ ఈ ఏడాది ఐర్లాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌ తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.


Next Story