ఆడిన చిన్న ఇన్నింగ్స్ ద్వారా కూడా చరిత్ర సృష్టించాడు..!

ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌పై పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం తన స్వల్ప ఇన్నింగ్స్ ద్వారా చరిత్ర సృష్టించాడు.

By Medi Samrat  Published on  23 Feb 2025 8:15 PM IST
ఆడిన చిన్న ఇన్నింగ్స్ ద్వారా కూడా చరిత్ర సృష్టించాడు..!

ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌పై పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం తన స్వల్ప ఇన్నింగ్స్ ద్వారా చరిత్ర సృష్టించాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం 26 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. దీంతో బాబర్ ICC ODI టోర్నమెంట్లలో 1000 పరుగులు పూర్తి చేశాడు. త‌ద్వారా పాకిస్థాన్ తరఫున ఐసీసీ వన్డే ఈవెంట్లలో వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో సయీద్ అన్వర్, జావేద్ మియాందాద్ ఐసీసీ వన్డే టోర్నీలో 1000 పరుగుల స్కోరును పూర్తి చేశారు. బాబర్ ఆజం ఆదివారం ఈ దిగ్గజాల క్లబ్‌లోకి ప్రవేశించాడు.

30 ఏళ్ల బాబర్ ఆజం ప్రస్తుతం తన పేలవమైన ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కంటున్నాడు. బాబర్ ఆజం అంతకుముందు న్యూజిలాండ్‌పై 64 పరుగులు చేసినా.. చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటి నుంచి అత‌డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. బాబర్ ఆజం 2023లో తన చివరి వన్డే సెంచరీని సాధించాడు.

బాబర్ అజామ్ ICC ODI ఈవెంట్లలో తన 1000 పరుగులను 24 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేశాడు. పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ 25 ఇన్నింగ్స్‌ల్లో 1204 పరుగులు చేయగా, జావేద్ మియాందాద్ 30 ఇన్నింగ్స్‌ల్లో 1083 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై చాలా నెమ్మదిగా హాఫ్ సెంచరీ చేసిన ఇన్నింగ్స్‌లో కూడా బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. అది బాబర్ అజామ్‌కి 100వ అంతర్జాతీయ హాఫ్ సెంచరీ. ఇంజమామ్ ఉల్ హక్ పాక్ త‌రుపున 129 హాఫ్ సెంచరీలు చేశాడు. బాబర్ ఆజం రెండో స్థానంలో నిల‌వ‌గా.. మహ్మద్ యూసుఫ్ 95 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. జావేద్ మియాందాద్ (93), మిస్బా ఉల్ హక్ (84) టాప్-5 జాబితాలో నిలిచారు.

Next Story