ధోని రికార్డును సమం చేసిన బాబర్ ఆజం
Babar Azam equals MS Dhoni in a major record after PAK beat NZ in 1st T20I. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు, బాబర్ ఆజం పాకిస్థాన్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉంటాడా లేదా అనే చాలా చర్చలు జరిగాయి.
By Medi Samrat Published on 15 April 2023 12:00 PM IST
Babar Azam equals MS Dhoni in a major record after PAK beat NZ in 1st T20I
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు, బాబర్ ఆజం పాకిస్థాన్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉంటాడా లేదా అనే చాలా చర్చలు జరిగాయి. పిసిబి ఛైర్మన్ నజామ్ సేథీ బాబర్‌ను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగించనున్నట్లు ధృవీకరించారు. దీంతో బాబర్ అభిమానుల్లో ఓ టెన్షన్ మొదలైంది.. సిరీస్ ను గెలిస్తే కానీ కెప్టెన్సీని నిలబెట్టుకోలేడేమో అనే భయం వెంటాడుతోంది. అయితే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 88 పరుగుల భారీ తేడాతో ఓడించింది పాక్. దీంతో పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో బాబర్ ఆజం.. MS ధోనీని సమం చేసి రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్‌ను (40 విజయాలు) బాబర్ తాజాగా అధిగమించాడు. అయితే బాబర్ ఆజం ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్‌గా 41 విజయాలతో ధోనీ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ 20 ఓవర్ల గేమ్‌లో ఎమ్ఎస్ ధోని తన సారథ్యంలో భారత్‌కు 41 విజయాలను అందించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ విజయాలు గెలిస్తే బాబర్ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. T20I క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లుగా ఇయాన్ మోర్గాన్, అస్గర్ ఆఫ్ఘన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్‌లకు నాయకత్వం వహించిన వాళ్ళు 42 మ్యాచ్‌లు గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాక్ విజయంతో మొదలుపెట్టింది. లాహొర్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టీ20లో 88 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. పాక్ పేసర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ నాలుగు వికెట్లు తీయగా ఇమాద్ వసీం రెండు, అఫ్రిది, షాదాబ్ ఖాన్, జమాన్ ఖాన్, ఆష్రాఫ్ తలా వికెట్ సాధించారు.