కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన బాబ‌ర్

Babar Azam breaks another Virat Kohli record.టీ 20 క్రికెట్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ భార‌త కెప్టెన్ విరాట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Oct 2021 5:30 AM GMT
కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన బాబ‌ర్

టీ 20 క్రికెట్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో వేగ‌వంతంగా 1000 ప‌రుగులు పూర్తి చేసిన‌ కెప్టెన్‌గా బాబ‌ర్ నిలిచాడు. విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును అందుకోగా.. బాబ‌ర్ అజామ్ కేవ‌లం 26 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. శుక్ర‌వారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్ లో బాబ‌ర్ ఈ ఘ‌న‌త సాధించాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్‌ డుప్లెసిస్‌ (31), ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్ (32), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ (36 ) కోహ్లీ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక పాకిస్థాన్ ఈ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న జైత్ర‌యాత్రను కొన‌సాగిస్తోంది. టోర్నీలో వ‌రుస‌గా మూడో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కెప్టెన్ మహమ్మద్ నబీ(35 నాటౌట్; 32 బంతుల్లో 5 ఫోర్లు), గుల్బాదీన్ నైబ్(35 నాటౌట్; 25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌) రాణించారు. అనంత‌రం పాకిస్థాన్ ల‌క్ష్యాన్ని 19 ఓవ‌ర్ల‌లోనే పూర్తి చేసింది. పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ (51; 47 బంతుల్లో 4 పోర్లు) రాణించ‌గా.. చివ‌ర్లో అసీఫ్ అలీ (7 బంతుల్లో 4 సిక్స్‌లతో 25 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్‌కు మ‌రో అద్భుత విజ‌యాన్ని అందించాడు. ఈ విజ‌యంతో పాక్ సెమీపైన‌ల్‌కు మ‌రింత చేరువైంది.

ర‌షీద్ ఖాన్ సైతం..

అఫ్గానిస్థాన్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ సైతం ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ అజామ్‌, మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్‌ల‌ను పెవిలియ‌న్ చేర్చ‌డం ద్వారా పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. శ్రీలంక మాజీ పేస‌ర్ ల‌సిత్ మ‌లింగ 76 ఇన్నింగ్స్‌లో ఈ ఘ‌న‌త సాధించ‌గా.. ర‌షీద్ 56 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును అందుకున్నాడు. ఈ జాబితాలో పేస‌ర్ టీమ్ సౌథి(82), బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ షకీబ్ ఆల్ హ‌స‌న్‌(83) లు వ‌రుస‌గా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

Next Story