రూల్స్ మార్చిన ఐసీసీ.. రెండో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌

Australia jump past India as ICC tweaks World Test Championship rules. అనుకున్న‌దే జ‌రిగింది. అంత‌ర్జాతీయ

By Medi Samrat  Published on  20 Nov 2020 12:16 PM GMT
రూల్స్ మార్చిన ఐసీసీ.. రెండో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌

అనుకున్న‌దే జ‌రిగింది. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ఐసీసీ) టెస్టు చాంపియ‌న్‌షిప్‌కు సంబంధించిన ర్యాకింగ్ ప‌ద్ద‌తి మార్చింది. దీంతో ఇప్ప‌టి దాకా పాయింట్ల ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్ర‌క‌టించ‌గా.. తాజాగా సిరీస్‌ల్లో గెలిచిన మ్యాచ్‌ల పాయింట్ల శాతాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డింది. దీంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌ను వెనక్కి నెడుతూ ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది.

కరోనా కారణంగా కొన్ని సిరీస్‌లు జరగని నేపథ్యంలో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ సూచనల ప్రకారం.. పాయింట్ల విధానాన్ని ఐసీసీ మార్చింది. 'కరోనా కారణంగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సగం కన్నా తక్కువ మ్యాచ్‌లు జరిగాయి. ముగింపు తేదీ నాటికి 85 శాతం మ్యాచ్‌లే పూర్తవుతాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం జట్ల స్థానాలను నిర్ణయించడం కోసం పాయింట్లను పరిగణనలోకి తీసుకునేవారు. ఇప్పుడు సంపాదించిన పాయింట్ల శాతం ఆధారంగా జట్లకు ర్యాంకులు కేటాయిస్తారు. ఐసీసీ క్రికెట్‌ కమిటీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు రెండూ ఈ కొత్త విధానానికి మద్దతుపలికాయి. పూర్తి మ్యాచ్‌లు ఆడలేకపోయిన జట్లకు నష్టం జరగదు' అని ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మను సాహ్నే చెప్పాడు.

ఇక కొత్త పాయింట్ల విధానం ఆస్ట్రేలియాకు క‌లిసొచ్చింది. పాయింట్ల శాతాన్ని లెక్క‌లోకి తీసుకోవ‌డం వ‌ల్ల కంగారు జ‌ట్టు మొద‌టి స్థానానికి వ‌చ్చింది. మూడు సిరీస్‌ల్లో 7 విజ‌యాలు, 2 ఓట‌ములు, 1 డ్రా తో మొత్తం 360 పాయింట్లగానూ 296 పాయింట్లు సాధించింది. దీంతో 82.2 శాతంతో ఆసీస్ అగ్ర‌స్థానంలో ఉంది. ఇక నాలుగు సిరీస్‌ల్లో 7 విజ‌యాలు, 2 ఓట‌ములు, 0 డ్రాల‌తో మొత్తం 480 పాయింట్ల‌కు గాను 360 పాయింట్లు సాదించిన భార‌త్ 75 శాతంతో రెండో స్థానంలో కొన‌సాగుతుంది. 60శాతంతో ఇంగ్లాండ్‌(292 పాయింట్ల) మూడో స్థానంలో కొనసాగుతుంది.

ఇక షెడ్యూల్ ప్ర‌కార‌మే వ‌చ్చే ఏడాది జూన్‌లో ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు లార్డ్స్ వేదిక‌గా ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు టెస్టు ఛాంపియ‌న్‌పిష్‌ను అంద‌జేయ‌నున్నారు.
Next Story
Share it