సరిపోయింది.. వర్షం ఆగట్లే.. మనోళ్లు నిలవట్లే..!
బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మరోసారి చిక్కుల్లో పడింది.
By Medi Samrat Published on 16 Dec 2024 9:31 AM GMTబ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మరోసారి చిక్కుల్లో పడింది. ఆస్ట్రేలియన్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే వర్షం కారణంగా విజిటింగ్ టీమిండియాకి కాస్త ఉపశమనం లభించింది. మూడో రోజైన సోమవారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆట ముందుగానే ముగిసింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. వర్షం రాకపోతే భారత్ మరిన్ని వికెట్లు కోల్పోయేది. టీం ఇండియా ఇంకా ఆస్ట్రేలియా కంటే 394 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలు సాధించారు. హెడ్ 152 పరుగులు, స్మిత్ 101 పరుగులు చేశారు. వీరిద్దరూ కాకుండా అలెక్స్ కారీ 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.
బ్రిస్బేన్‌లో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేస్తారని భావించారు. కానీ టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ తడబడింది. తొలి ఓవర్ రెండో బంతికే యశస్విని మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన యశస్వి తర్వాతి బంతికి ఔటయ్యాడు. స్టార్క్ తన తర్వాతి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. గిల్ కూడా ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అంచనాలతో మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లి నిరాశతో వెనుదిరిగాడు. జోస్ హేజిల్‌వుడ్ అతనిని అవుట్ చేశాడు. భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 22 పరుగుల వద్ద ఉండగా వర్షం రావడంతో ఆటను ఆపాల్సి వచ్చింది. మధ్యాహ్న భోజనం ప్రకటించారు. ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగానే రెండు-మూడు ఓవర్ల వ్యవధిలో వర్షం మూడుసార్లు ఆటను నిలిపివేసింది. దీని తర్వాత పాట్ కమిన్స్ ధాటికి రిషబ్ పంత్ వికెట్ ను భారత్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మళ్లీ వర్షం పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీని తర్వాత మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో మూడోరోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు.