ఆసీస్ గెలిచింది అన‌డం క‌న్నా.. మ‌న‌వాళ్లే గెలిపించారు అన‌డం స‌బ‌బేమో

Australia chase down 209 to beat India by four wickets.మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఓట‌మితో మొద‌లెట్టింది భార‌త్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sept 2022 9:19 AM IST
ఆసీస్ గెలిచింది అన‌డం క‌న్నా.. మ‌న‌వాళ్లే గెలిపించారు అన‌డం స‌బ‌బేమో

బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు చేస్తున్నా ప‌స‌లేని బౌలింగ్‌, పేల‌వ ఫీల్డింగ్ కార‌ణంగా టీమ్ఇండియా గ‌త కొద్ది రోజులుగా గెలిచే మ్యాచ్‌ల‌ను ఓడిపోతుంది. ఈ కార‌ణంగా ఆసియా క‌ప్‌లో ఫైన‌ల్ చేర‌కుండానే ఇంటిముఖం ప‌ట్ట‌గా ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తోనూ అదే కొన‌సాగుతోంది. తొలుత క‌ష్ట‌ప‌డి 209 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించినా ఆ త‌రువాత బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్ర‌త్య‌ర్థికి ప్రోత్సాహాన్నందించి మ్యాచ్‌ను అప్ప‌గించేశారు. ఇది ఇలాగే కొన‌సాగితే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై టీమ్ఇండియా ఆశ‌లు వ‌దిలివేసుకోవాల్సిందే.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఓట‌మితో మొద‌లెట్టింది భార‌త్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (71 నాటౌట్‌; 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (55; 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాల‌తో చెల‌రేగ‌గా.. సూర్య‌కుమార్ యాద‌వ్ (46; 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(11), విరాట్‌ కోహ్లీ (2), అక్షర్‌ పటేల్‌ (6), దినేశ్‌ కార్తీక్‌ (6) లు విఫ‌లం అయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఎలీస్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా హజిల్‌వుడ్‌ రెండు వికెట్లు తీశాడు.

అనంతరం లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మ‌రో నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలుత కామెరూన్‌ గ్రీన్‌ (61; 30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టీవ్ స్మిత్‌( 35; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) లు బ‌ల‌మైన పునాధి వేయ‌గా ఆఖ‌ర్లో మాథ్యూ వేడ్‌ (45 నాటౌట్‌; 21 బంతుల్లో6 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. కామెరూన్ గ్రీన్‌, స్టీవ్ స్మిత్ లు వారి ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో ఇచ్చిన మూడు తేలికైన క్యాచ్‌ల‌ను భార‌త ఫీల్డ‌ర్లు విడిచిపెట్ట‌డంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. భార‌త బౌల‌ర్ల‌లో ఉమేశ్ యాద‌వ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అక్ష‌ర్ ప‌టేల్ (3/17) కెరీర్ ఉత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. భువ‌నేశ్వ‌ర్‌(4-0-52-0), హ‌ర్ష‌ల్ ప‌టేల్ (4-0-49-0), చాహ‌ల్‌(3.2-0-42-1), హార్ధిక్ పాండ్య‌(2-0-22-0) తేలిపోయారు. గ్రీన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నాగ్‌పూర్ వేదిక‌గా శుక్రవారం రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

బాగా బౌలింగ్ చేయ‌లేదు..

ఈ మ్యాచ్‌లో మేం బౌలింగ్ బాగా చేయ‌లేదు. 200 మంచి స్కోరే. కాపాడుకోవాల్సింది. మేం అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకోలేదు. మా బ్యాటింగ్ బాగుంది. వేడ్‌, టిమ్ డేవిడ్‌ల‌లో ఒక‌రిని త్వ‌ర‌గా పెవిలియ‌న్ చేర్చినా ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. మేమ‌లా చేయ‌లేక‌పోయాం. అని రోహిత్ శ‌ర్మ అన్నాడు.

Next Story