సిడ్ని వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో అతిథ్య ఆసీస్‌కు 94 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. రెండోరోజు ఆటలో ఆధిక్యం కనబరిచిన భారత్ మూడో రోజు ఆటలో పూర్తిగా తడబడింది. ఓవర్‌నైట్ ఆటగాడు చతేశ్వర్ పుజారా(50; 176 బంతుల్లో 5 ఫోర్లు)హాఫ్ సెంచరీ సాధించగా, రిషభ్ పంత్(36; 67 బంతుల్లో 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఓవర్‌నైట్ స్కోర్ 96/2 తో శనివారం మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 148 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
శనివారం ఆటను ఆరంభించిన పుజారా-రహానే(22) జోడి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇద్దరూ క్రీజులో కుదురుకున్నట్లే కనిపించగా.. కమిన్స్ ఈ జోడిని విడదీశాడు. రహానే ను కమిన్స్ క్లీన్‌బౌల్డ చేశాడు. అప్పటికి భారత్ స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 117 పరుగులు మాత్రమే. ఆ తరువాత వచ్చిన విహారి(4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అనవసరంగా రన్‌కు ప్రయత్నించి రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను పుజారా-పంత్ జోడి తీసుకుంది. వీరిద్దరు ఆసీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు.
వీరిద్దరు ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. పంత్‌ను హాజిల్‌వుడ్ ఔట్ చేయగా.. పుజారాను కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత వచ్చిన అశ్విన్(10), సైనీ (0), బుమ్రా(0) వెంటవెంటనే ఔట్ అయ్యారు. జడేజా(28 నాటౌట్) మాత్రం కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో భారత్ 240 పరుగుల మార్కును దాటింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4, హెజిల్‌వుడ్ 2, స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.