మాయ చేసిన జ‌డేజా.. 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఆసీస్‌

Australia Bowled Out for 113 Jadeja Claims a Seven-fer.ర‌వీంద్ర జ‌డేజా దెబ్బ‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు విల‌విల‌లాడింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2023 11:36 AM IST
మాయ చేసిన జ‌డేజా.. 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఆసీస్‌

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా దెబ్బ‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు విల‌విల‌లాడింది. బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. జ‌డేజా 7 వికెట్ల‌తో ఆసీస్ ప‌త‌నాన్ని శాసించగా, స్పిన్న‌ర్ అశ్విన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కు ఒక్క ప‌రుగు ఆధిక్యం ల‌భించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని క‌లుపుకుంటే భార‌త్ ఎదుట 115 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. చూడ‌డానికి ల‌క్ష్యం చిన్న‌దిగానే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ పిచ్ స్పిన్న‌ర్ల‌కు స‌హ‌క‌రిస్తున్న నేప‌థ్యంలో భార‌త బ్యాట‌ర్లు రాణించ‌డంపైనే విజ‌యం ఆధార‌ప‌డింది.

ఓవ‌ర్ నైట్ స్కోర్ వికెట్ న‌ష్టానికి 61 ప‌రుగుల‌తో మూడో రోజు ఆట ఆరంభించిన ఆసీస్‌ మ‌రో 52 ప‌రుగులు ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది. భార‌త స్పిన్ ద్వ‌యం అశ్విన్‌, జ‌డేజాల‌ను ఎదుర్కొన‌లేక ఆసీస్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 ప‌రుగులు చేయ‌గా భార‌త్ 262 ప‌రుగులు చేసింది.

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ప్ర‌స్తుతం 1-0 ఆధిక్యంలో ఉన్న భార‌త్ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేదించి ఆధిక్యాన్ని 2-0 కి పెంచుకోవాల‌ని బావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధిస్తే ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ ఫైన‌ల్‌కు చేరుకునేందుకు మార్గం సుగ‌మం అవుతుంది.

Next Story