తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం
Australia Beat India In First Test. సుదీర్ఘ పార్మాట్‌లో అతిథ్య ఆస్ట్రేలియానే బోణి కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన
By Medi Samrat Published on 19 Dec 2020 8:32 AM GMTసుదీర్ఘ పార్మాట్‌లో అతిథ్య ఆస్ట్రేలియానే బోణి కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి డే అండ్ నైట్ టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 90 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి మాత్రమే చేదించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్ ఇప్పటి వరకు ఆడిన పింక్ బాల్ టెస్టుల మ్యాచ్‌ల అన్నింటినిలో విజేతగానే నిలిచింది.
90 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్ కు ఆ జట్టు ఓపెనర్లు మాథ్యూవేడ్ (33), జో బర్న్స్ (51 నాటౌట్) శుభారంభం ఇచ్చారు. లక్ష్యం పెద్దది కాకపోవడం.. ఇంకా రెండున్న రోజుల సమయం ఉండడంతో.. ఈ ఇద్దరూ ఏ మాత్రం తొందర లేకుండా బ్యాటింగ్ చేశారు. గాయంతో షమీ దూరం అవడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. బుమ్రా, ఉమేశ్ బౌలింగ్‌ను సాధికారంగా ఆడిన ఈ జంట తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అనంతరం మాథ్యూవేడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన లబుషేన్‌ను అశ్విన్ బుట్టలో వేశాడు. మయాంక్ చక్కని క్యాచ్ అందుకోవడంతో 82 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే.. లక్ష్యం పెద్దగా లేకపోవడంతో.. స్టీవ్‌స్మిత్(1)తో కలిసి జో బర్న్స్ జట్టుకు విజయాన్ని అందించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 244 ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 191 పరుగులు చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలగా.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 93 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.