IND vs AUS : ఆఖ‌రి వ‌న్డేలో భార‌త్ ఓట‌మి.. సిరీస్ ఆసీస్ కైవ‌సం

ఆఖ‌రి వ‌న్డేలో ఆసీస్ 21 ప‌రుగుల తేడాతో భార‌త్‌పై విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో కైవ‌సం చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2023 9:24 AM IST
IND vs AUS, Team India

వ‌న్డే సిరీస్ ట్రోఫీతో ఆస్ట్రేలియా జ‌ట్టు


సొంత‌గ‌డ్డ‌పై భార‌త్‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. స్వ‌దేశంలో త‌మ‌కు తిరుగులేద‌నుకుంటున్న టీమ్ఇండియాకు ఆస్ట్రేలియా దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. చెన్నైలో జరిగిన ఆఖ‌రి, నిర్ణ‌యాత్మ‌క వ‌న్డేలో ఆసీస్ 21 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

ఆసీస్ నిర్దేశించిన 270 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ అందుకోలేక‌పోయింది. చివ‌రికి 49.1ఓవ‌ర్ల‌లో 248 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త బ్యాట‌ర్లలో విరాట్ కోహ్లీ(54), హార్థిక్ పాండ్యా(40) లు రాణించారు. మిగిలిన బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(30), శుభ్‌మ‌న్ గిల్‌(37), కేఎల్ రాహుల్‌(32)ల‌కు మంచి ఆరంభాలు ల‌భించినా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌డంలో విఫ‌లం అయ్యారు.

ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, గిల్‌లు వేగంగా ఆడ‌డంతో భార‌త్ 9 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 65 ప‌రుగులు చేసింది. చేధ‌న సాఫీగా సాగుతున్న‌ట్లు అనిపిస్తున్న త‌రుణంలో వీరిద్ద‌రు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్‌కు చేరారు. ఈ ద‌శ‌లో కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు కాస్త ప‌ట్టుద‌ల‌తో బ్యాటింగ్ చేయ‌డంతో భార‌త్ కుదురుకుంది. భారీ షాట్‌కు య‌త్నించి రాహుల్ ఔట్ కాగా.. మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే స‌మ‌న్వ‌య లోపంతో అక్ష‌ర్ ర‌నౌట్ అయ్యాడు.

అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్న కోహ్లీ, పాండ్యాతో క‌లిసి విజ‌య‌తీరాల‌ను చేర్చేలా క‌నిపించాడు. అయితే ఒక్క ఓవ‌ర్‌లో అంతా త‌ల్ల‌కిందులైంది. అగ‌ర్ వ‌రుస బంతుల్లో కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌(0)ల‌ను ఔట్ చేసి టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ ఇచ్చాడు. ర‌న్‌రేట్ పెరిగిపోతుండ‌డంతో భారీ షాట్లు ఆడే క్ర‌మంలో హార్థిక్‌, జ‌డేజాలు ఔట్ కావ‌డంతో భార‌త ఓట‌మి ఖాయ‌మైంది. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఆడమ్‌ జంపా(4/45) నాలుగు వికెట్లతో విజృంభించాడు.

అంత‌క‌ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 49 ఓవ‌ర్ల‌లో 269 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిచెల్ మార్ష్‌(47) టాస్ స్కోర‌ర్ కాగా.. అల‌క్స్ కేరీ(38), హెడ్‌(33), వార్న‌ర్‌(23), ల‌బుషేన్‌(28)లు త‌లా కొన్ని ప‌రుగులు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్ చెరో మూడేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. జంపాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, మార్ష్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ దక్కాయి.

Next Story