రెండో టెస్టులో సత్తాచాటిన భారత బౌలర్లు.. 195కే ఆసీస్ ఆలౌట్
Australia 195 all out. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు.
By Medi Samrat Published on 26 Dec 2020 6:25 AM GMTమెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. విరాట్ కోహ్లీ గైర్హజరీలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రహానే బౌలర్లను చాలా చక్కగా ఉపయోగించుకుని అతిథ్య ఆస్ట్రేలియాను 195 పరుగులకే కట్టడి చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు.
తొలి టెస్టు గెలిచిన ఉత్సాహాంలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ ఫైన్ టాస్ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. అది ఎంత తప్పుడు నిర్ణయమో కొద్ది సేపట్లలోనే అతడికి అర్థమై ఉంటుంది. ఉదయం పిచ్‌పై ఉండే పచ్చికను సద్వినియోగం చేసుకున్న భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో ఆసీస్ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. బుమ్రా తొలుత ఓపెనర్ జో బర్న్స్(0)ను డకౌట్ చేయగా ఆ తరువాత అశ్విన్.. మ్యాథ్యూవేడ్(30), స్టీవ్ స్మిత్(0) లను స్వల్ప వ్యవధిలో పెలివియన్ చేర్చాడు. స్మిత్ ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పుజారా డైవ్ చేస్తే అద్భుత క్యాచ్ అందుకున్నాడు. అనంతరం మర్నాస్ లబుషేన్ (48), ట్రావిస్ హెడ్(38) కలిసి బాధ్యతాయుతంగా ఆడి నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడగొట్టాడు. హెడ్‌ను బుమ్రా పెవిలియన్ చేర్చగా.. కాసేపటికే లబుషేన్‌ను సిరాట్ వెనక్కి పంపాడు. దీంతో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులతో టీకి వెళ్లింది ఆసీస్.
టీ విరామం అనంతరం కూడా భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో.. గ్రీన్(12), టీమ్‌పైన్ (13), ప్యాట్‌కమిన్స్ (9), మిచెల్ స్టార్క్ (7), నాథన్ లియోన్ (20) లు పెవిలియన్‌కు చేరకతప్పలేదు. దీంతో ఆసీస్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలింది.