Asia Cup: పాకిస్తాన్‌కు తెలుగోడి దెబ్బ.. భారత్‌ను గెలిపించిన తిలక్‌

ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా మట్టి కరిపించి తొమ్మిదోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

By -  అంజి
Published on : 29 Sept 2025 7:03 AM IST

Asia Cup, Tilak Verma, Pakistan, India, victory

Asia Cup: పాకిస్తాన్‌కు తెలుగోడి దెబ్బ.. భారత్‌ను గెలిపించిన తిలక్‌

ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా మట్టి కరిపించి తొమ్మిదోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 147 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌ ఆరంభంలో 20 రన్స్‌కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్‌ (69*), దూబే (33) రాణించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో తిలక్‌ వర్మ అద్భుతంగా పోరాడి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. పాక్‌ బౌలర్లలో అష్రప్‌ 3, అఫ్రీది, అబ్రార్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

పాకిస్తాన్‌పై అద్భుతంగా ఆడి ఇండియాను గెలిపించిన తిలక్‌ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసియా కప్‌ ఫైనల్‌లో తిలక్‌ వర్మ అసాధారణ ఇన్నింగ్స్‌ (69*) ఆడారు. దాయాదీ పాక్‌ను మట్టికరిపించి భారత్‌కు ట్రోఫీని అందించారు. ఇక గెలుపు కష్టమే అన్న పరిస్థితి నుంచి విజేతగా నిలిపారు. జట్టుకు లక్కీ ప్లేయర్‌గా మారారు. ఛేజింగ్‌లో ఆరంభం నుంచి వరుసగా వికెట్లు పడుతున్నా పాక్‌ విజయానికి అడ్డుగోడగా నిలబడ్డారు. గెలుపు ఖాయమనుకున్న ప్రత్యర్థికి తెలుగోడి దెబ్బ రుచి చూపించి కాలరాత్రి మిగిల్చారు.

తిలక్‌ హైదరాబాద్‌కు చెందిన వాడు. కూకట్‌పల్లిలో పుట్టి పెరిగాడు. ఆయన తండ్రి బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అండర్‌ 19 వరకు ద్రవిడ్‌ కోచింగ్‌లో రాటుదేలిన తిలక్ ప్రతిభను గుర్తించి ముంబై ఇండియన్స్‌ (ఐపీఎల్‌)-2022లో అతడిని దక్కించుకుంది. 2023లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన తిలక్‌ వర్మ 32 టీ20ల్లో 962 రన్స్‌ చేశారు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. సగటు 53గా ఉండటం విశేషం. మనోడి దెబ్బకు పాకిస్తాన్‌ అల్లాడిపోయింది. ప్రస్తుతం తిలక్‌ హ్యాష్‌ట్యాగ్‌ ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతోంది. సాధారణ కుటుంబంలో జన్మించిన తిలక్‌.. నేడు అంతర్జాతీయ స్థాయిలో పాక్‌ను మట్టికరిపించాడు.

Next Story