రాంచీ టెస్ట్ మ్యాచ్ లో రికార్డులు బద్దలు కొట్టిన అశ్విన్, రోహిత్ శర్మ

రాంచీ టెస్ట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డును అందుకున్నాడు. భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల (351) రికార్డును బద్దలుకొట్టిన అశ్విన్‌..

By Medi Samrat  Published on  25 Feb 2024 4:18 PM GMT
రాంచీ టెస్ట్ మ్యాచ్ లో రికార్డులు బద్దలు కొట్టిన అశ్విన్, రోహిత్ శర్మ

రాంచీ టెస్ట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డును అందుకున్నాడు. భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల (351) రికార్డును బద్దలుకొట్టిన అశ్విన్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల (5/51) ప్రదర్శన అనంతరం భారత్‌ తరఫున కుంబ్లే పేరిట ఉండిన అ‍త్యధిక ఐదు వికెట్ల ఘనతల రికార్డును సమం చేశాడు. కుంబ్లే 132 టెస్ట్‌ల్లో 35 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేస్తే.. అశ్విన్‌ కేవలం 99 టెస్ట్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేసిన రికార్డు స్పిన్‌ దిగ్గజం మురళీథరన్‌ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్‌ల్లో ఏకంగా 67 సార్లు ఐదు వికెట్లు తీశాడు.

ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 4000 పరుగుల మార్కును తాకాడు రోహిత్ శర్మ. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అత్యంత వేగంగా 4000 పరుగుల మార్కును తాకిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ పదో స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ క్రికెట్‌ లో 58 మ్యాచ్‌లు ఆడి 11 సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీల సాయంతో 44.99 సగటున 4004 పరుగులు చేశాడు రోహిత్. రాంచీ టెస్ట్ మ్యాచ్ లో 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 24, యశస్వి జైస్వాల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 152 పరుగులు చేయాలి.

Next Story