Video : అశుతోష్ ఆనందాన్ని రెట్టింపు చేసిన ధావన్..!

సోమవారం జరిగిన ఐపీఎల్ 2025 నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్‌జెయింట్‌ను ఒక వికెట్ తేడాతో ఓడించింది.

By Medi Samrat
Published on : 25 March 2025 11:15 AM IST

Video : అశుతోష్ ఆనందాన్ని రెట్టింపు చేసిన ధావన్..!

సోమవారం జరిగిన ఐపీఎల్ 2025 నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్‌జెయింట్‌ను ఒక వికెట్ తేడాతో ఓడించింది. ఒక రకంగా చెప్పాలంటే లక్నోనోట్లో నుంచి ఢిల్లీ విజయాన్ని లాగేసుకుంది. దీనికి ప్రధాన కారణం 66 పరుగులతో అజేయంగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ. ఈ మ్యాచ్‌లో 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ జట్టు 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆపై విప్రజ్ నిగమ్ (31)తో కలిసి అశుతోష్ శర్మ బాధ్యతలు చేపట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అశుతోష్‌ ఇన్నింగ్స్ సాయంతో ఢిల్లీ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది.

అశుతోష్ శ‌ర్మ కేవలం 31 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో అజేయంగా 66 పరుగులు చేశాడు. అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 26 ఏళ్ల అశుతోష్ శర్మ తన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును మెంటార్ శిఖర్ ధావన్‌కు అంకితం చేశాడు. మ్యాచ్ అనంతరం అశుతోష్ మాట్లాడుతూ.. 'నా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నా మెంటార్ శిఖర్ పాజీకి అంకితం చేస్తున్నానని పేర్కొన్నాడు.

అశుతోష్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగిరాగానే వేడుకలు రెట్టింపు అయ్యాయి. అందుకు కారణం భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ వీడియో కాల్ చేసి అశుతోష్ శర్మకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ ఒక క్లిప్‌ను షేర్ చేసింది. అందులో అశుతోష్, 'శిఖర్ ధావన్ చాలా సంతోషంగా మాట్లాడ‌టం చూడొచ్చు. అశుతోష్ లవ్ యూ పాజీ అంటూ అప్యాయంగా పిలుస్తాడు. ఇందులో శిఖర్ ధావన్ వాయిస్ వినిపించలేదు కానీ.. అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడిన‌ అశుతోష్‌కి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలిసింది.

ఐపీఎల్ 2024 ప్రీ-సీజన్ క్యాంప్‌లో అశుతోష్ శర్మ శిఖర్ ధావన్‌ను మొదటిసారి కలిశాడు. అప్పుడు ఇద్దరూ పంజాబ్ కింగ్స్‌లో ఆడారు. అశుతోష్ ఆట‌కు ముగ్ధుడైన‌ ధావన్ అతనికి తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. అశుతోష్‌కి ఇది చిరస్మరణీయమైన బహుమతి.. ఎందుకంటే ఈ బ్యాట్‌తో అతను తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో గుజరాత్‌పై సెంచరీ చేశాడు. ఆ తర్వాత ధావన్‌, అశుతోష్ శర్మల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ధావన్ సలహా అశుతోష్ శర్మకు బాగా ఉపయోగపడింది. ధావన్ సహాయంతో తాను ఆలోచన, దృక్పథం, సానుకూల మనస్తత్వంపై అవగాహన పొందిన‌ట్లు అశుతోష్ చెప్పాడు. అశుతోష్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో రైల్వేస్ తరపున ఆడుతున్నాడు.

Next Story