ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ ఓటమి..!
Ashleigh Barty Knocked Out After Losing To Karolina Muchova In Quarters. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ లో సంచలనాలు నమోదయ్యాయి.
By Medi Samrat Published on 17 Feb 2021 9:00 PM IST
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ లో సంచలనాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లో టాప్ సీడ్ గా బరిలోకి దిగిన ఆష్లే బార్టీ క్వార్టర్ ఫైనల్ లోనే ఓటమి పాలైంది. 25వ సీడ్ గా బరిలోకి దిగిన కరోలినా ముచోవా చేతిలో ఘోర ఓటమి పాలైంది. 6-1, 3-6, 2-6 తేడాతో బార్టీని ఓడించిన ముచోవా, సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను 6-1 తేడాతో ఓడిపోయిన ముచోవా, ఆపై అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. బార్టీని ముప్పుతిప్పలు పెట్టింది. రెండో సెట్ ను 3-6 తేడాతో గెలుచుకున్న ముచోవా, మూడో సెట్ లోనూ 2-6తో విజయాన్ని సొంతం చేసుకుంది.
'మొదటి సెట్ ముగిసే సమయానికి ఓడిపోతా అనుకున్నా. కానీ రెండు, మూడో సెట్లలో పుంజుకున్నా. చాలా సంతోషంగా ఉంది. బార్టీ చాలా బాగాఆడింది. దాదాపుగా ఆమె తప్పులు చేయలేదు' అని ముచోవా తెలిపింది. అన్ సీడెడ్ గా టోర్నీలో ప్రవేశించి క్వార్టర్స్ వరకూ చేరుకున్న జెస్సికా పెగులా, 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీల మధ్య జరిగే మ్యాచ్ లో విజయం సాధించిన ప్లేయర్ తో ముచోవా సెమీస్ లో తలపడనుంది. మరో మ్యాచ్ లో పదో సీడ్ సెరెనా విలియమ్స్, రెండో సీడ్ గా పోటీలో దిగిన సిమోనా హలెప్ పై 6-3, 6-3 తేడాతో సునాయాసంగా గెలిచి, సెమీస్ లో నయామీ ఒసాకాతో తలపడేందుకు సిద్ధమవుతోంది.
రష్యా టెన్నిస్ క్రీడాకారుడు అస్లన్ కరత్సేవ్ కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఓపెన్ ఎరాలో అరంగేట్రం చేసిన గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే సెమీస్‌కు చేరిన తొలి టెన్నిస్ ప్లేయర్‌గా 27 ఏళ్ల అస్లన్ రికార్డు సృష్టించాడు. క్వాలిఫై ప్లేయర్‌గా బరిలోకి దిగిన అస్లన్ 2-6, 6-4, 6-1, 6-2 స్కోర్‌తో క్వార్టర్స్‌లో దిమిత్రోవ్‌పై విజయం సాధించాడు. సెమీస్‌లో టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్‌తో అస్లాన్ తలపడనున్నాడు. జకోవిచ్ ను ఓడిస్తే మరో సంచలనం తప్పకుండా అవుతుంది.