దక్షిణాఫ్రికా గ‌డ్డ‌పై ఆ రికార్డ్ సాధించిన తొలి భారత్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్..!

భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికాలో చరిత్ర సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ చేశాడు

By Medi Samrat  Published on  17 Dec 2023 2:17 PM GMT
దక్షిణాఫ్రికా గ‌డ్డ‌పై ఆ రికార్డ్ సాధించిన తొలి భారత్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్..!

భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికాలో చరిత్ర సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ చేశాడు. ఆదివారం జోహన్నెస్‌బర్గ్ లో అర్ష్‌దీప్ 37 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. త‌ద్వారా దక్షిణాఫ్రికాలో వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత్ ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. అంతే కాకుండా మరెన్నో రికార్డులు సృష్టించాడు.

దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం తప్పని రుజువైంది. భారత ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఫ్రికా జట్టును 116 పరుగులకే కట్టడి చేశారు. అర్ష్‌దీప్ ఐదు వికెట్లు తీశాడు. అవేష్ ఖాన్ కూడా నాలుగు వికెట్లు నేల‌కూల్చాడు. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. రీజా హెండ్రిక్స్, టోనీ డి గియోర్గి, రాస్సీ వాన్ డెర్ డుసెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయోలను అర్ష్‌దీప్ అవుట్ చేశాడు.

దక్షిణాఫ్రికాపై భారత బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శన చూస్తే.. సునీల్ జోషి నైరోబిలో(1999-5/6), యుజ్వేంద్ర చాహల్ సెంచూరియన్ (2018-5/22), రవీంద్ర జడేజా కోల్‌కతా (2023-5/33), అర్ష్‌దీప్ సింగ్ జోహన్నెస్‌బర్గ్ (2023-5/37)గా ఉన్నారు.

ఫాస్ట్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌, అవేశ్‌లు మొత్తం తొమ్మిది వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదే. అంతకుముందు 1993లో మొహాలీలో భారత ఫాస్ట్ బౌలర్లు ఎనిమిది వికెట్లు తీశారు. 2013లో కూడా సెంచూరియన్‌లో ఫాస్ట్ బౌలర్లు మొత్తం ఎనిమిది వికెట్లు సాధించారు.

116 పరుగులే సొంత గ‌డ్డ‌పై సౌతాఫ్రికా అత్యల్ప స్కోరు. అంతకుముందు 2018లో సెంచూరియన్‌లో 118 పరుగులు చేసింది. యాదృచ్ఛికంగా ఆ మ్యాచ్ కూడా భారత్ పైనే. ఓవరాల్‌గా భారత్‌పై వన్డేల్లో సౌతాఫ్రికాకు మూడో అత్యల్ప స్కోరు. అదే ఏడాది కోల్‌కతాలో భారత్ 83 పరుగులకే దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసింది. 2022లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్రికన్ జట్టు 99 పరుగులకే ఆలౌటైంది.

Next Story