మాజీ క్రికెటర్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ
భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది.
By Medi Samrat Published on 21 Dec 2024 10:14 AM GMTభారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)కు సంబంధించి ఉతప్ప మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు రూ. 23.36 లక్షల మోసానికి సంబంధించినది. ఈపీఎఫ్ ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాదారు.
కంపెనీ ప్రతినెలా పీఎఫ్ సొమ్మును మినహాయించిందని, అయితే అది తమ పీఎఫ్ ఖాతాలో జమ కావడం లేదని కంపెనీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం రూ.23 లక్షలుగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉతప్పపై మోసం కేసు నమోదైంది. ఉతప్పపై ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ షడక్షర గోపాల్ రెడ్డి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
అయితే ఈ విషయమై ఉతప్ప వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మీడియా కథనాల ప్రకారం.. డిసెంబర్ 4న ఉతప్పపై ఈ కేసు నమోదైంది. ఉతప్ప ఒకప్పుడు భారత జట్టులో ముఖ్యమైన సభ్యుడు. 2022లో అన్ని రకాల క్రికెట్‌ల నుండి రిటైర్ అయ్యాడు. ఉతప్ప భారత్ తరఫున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఉతప్ప 2007 T20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇది కాకుండా.. ఉతప్ప పలు IPL జట్లకు ఆడాడు.