డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసేందుకు జూన్ 9 గడువు వరకు రైతు నేతలు గడువు విధించారు. లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ సహా వివిధ ప్రాంతాల నుండి వివిధ ఖాప్‌లు, రైతుల సంఘాల ప్రతినిధులు హర్యానాలోని కురుక్షేత్రలో జాట్ ధర్మశాలలో సమావేశం అయ్యారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించిన రెజ్లర్‌లకు సంఘీభావం తెలిపారు. రైతు నేత రాకేష్ టికాయిత్ మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్ అరెస్టుకు సంబంధించి ప్రభుత్వానికి జూన్ 9 వరకు సమయం ఇస్తున్నామని అన్నారు. జూన్ 9 తరువాత దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, పంచాయితీలు నిర్వహిస్తామని అన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని, లేదంటే నిరసనలు ఎదుర్కోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు. 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టు రెజ్లర్లకు మద్దతు తెలిపింది. వారి మనోవేదనలను తప్పనిసరిగా పరిష్కరించాలని కోరారు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న బ్రిజ్ భూషణ్ కు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సోమవారం అయోధ్యలో ర్యాలీ నిర్వహించాలని అనుకోగా అది కాస్తా వాయిదా పడింది. తనకున్న మద్దతును చూపించుకునేందుకు ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. జూన్ 5న సాధువుల ఆశీస్సులతో 'జన చేతన్ మహార్యాలీ'ని నిర్వహించాలనుకున్నాను. అయితే ప్రస్తుతం నాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కొన్ని రోజుల పాటు దీనిని వాయిదా వేస్తున్నానని బ్రిజ్ భూషణ్ అన్నారు.