విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించిన వ‌రంగ‌ల్ కుర్రాడు

జెరూసలేం మాస్టర్స్ ఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు.

By -  Medi Samrat
Published on : 4 Dec 2025 4:00 PM IST

విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించిన వ‌రంగ‌ల్ కుర్రాడు

జెరూసలేం మాస్టర్స్ ఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఆ తర్వాత మ్యాచ్ బ్లిట్జ్ టై బ్రేక్‌లో జరిగింది. 22 ఏళ్ల అర్జున్ ఎరిగైసి టై బ్రేక్‌లో అద్భుత ప్రదర్శన చేసి 2.5-1.5 తేడాతో విజయం సాధించాడు. తెల్ల పావులతో తొలి బ్లిట్జ్ మ్యాచ్‌లో విజయం సాధించాడు. రెండో గేమ్‌లో కూడా అత‌డు విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత డ్రాకు అంగీకరించారు. ఇది టైటిల్ గెలవడానికి సరిపోతుంది. ఈ విజయంతో అర్జున్ ఎరిగైసి US$55,000 ప్రైజ్ మనీగా అందుకున్నాడు. ఈ అర్జున్ ఎరిగైసీ ఎవరో తెలుసుకుందాం.

అర్జున్ ఎరిగైసి 3 డిసెంబర్ 2003న ఆంధ్ర ప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ)లోని వరంగల్‌లో జన్మించాడు. తన స్నేహితులతో సరదాగా చెస్ ఆడటం మొదలుపెట్టాడు. అర్జునుకి నేర్చుకునే సామర్థ్యం, ఉత్సాహం ఉన్నందున చెస్ ఆడటం మంచిదని అర్జును తల్లిదండ్రులు సలహా ఇచ్చేవారు. అతడు విషయాలను గుర్తుంచుకోవడంలో నేర్పరి. చిన్న వయసులోనే 70 దేశాల రాజధానుల పేర్లు, వాటి కరెన్సీలు గుక్క తిప్పుకోకుండా చెప్పేవాడు. అతని ఆసక్తిని చూసిన అతని తండ్రి అతనికి 11 సంవత్సరాల వయస్సు నుండే చెస్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. 2017 తర్వాత‌ అర్జున్ తన అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. 14 సంవత్సరాల11 నెలల 13 రోజుల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు.

తరువాతి 6 సంవత్సరాలలో అర్జున్ భారత్‌ యొక్క బలమైన యువ ఆటగాడిగా ఉద్భవించాడు. త‌ద్వారా D గుకేష్, R ప్రగ్నానంద్, నిహాల్ సరిన్‌ల స‌ర‌స‌న చేరాడు. టైటిల్ గెలిచిన తర్వాత ఈ విజయం అంత సులువు కాదని ఎరిగైసి చెప్పాడు. నా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. నేను నా ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయాను. అయినప్పటికీ టైటిల్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జరిగిన రెండు మ్యాచ్‌లు (పీటర్ స్విడ్లర్‌తో, ఆపై ఆనంద్‌తో) చాలా ఒత్తిడితో కూడుకున్నాయని చెప్పాడు. ఆనంద్ సర్‌తో జరిగిన మొదటి గేమ్‌లో, మేమిద్దరం అవకాశాలు కోల్పోయాము, కానీ నేను బ్లిట్జ్‌లో బాగా ఆడాను అని పేర్కొన్నాడు.

Next Story