Paris Olympics : నాలుగో స్థానంలో నిలిచాడు.. తృటిలో పతకం మిస్..!
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో భారత స్టార్ షూటర్ అర్జున్ బాబౌటా పతకాన్ని కోల్పోయాడు. 15వ షాట్ వరకు అతడు మొదటి మూడు స్థానాల్లో నిలిచాడు
By Medi Samrat Published on 29 July 2024 5:50 PM IST
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో భారత స్టార్ షూటర్ అర్జున్ బాబౌటా పతకాన్ని కోల్పోయాడు. 15వ షాట్ వరకు అతడు మొదటి మూడు స్థానాల్లో నిలిచాడు. 16వ షాట్ తర్వాత అతడు నాల్గవ స్థానానికి పడిపోయాడు. ఆ తర్వాత అతడు 17, 18వ షాట్‌లలో ఎలిమినేషన్ దశకు చేరుకున్నాడు.
17వ ప్రయత్నంలో బాబౌటా 10.3 షాట్ ఆడగా, మిరాన్ 10.6తో షాట్ కొట్టాడు. 18వ ప్రయత్నంలో మిరాన్ మళ్లీ 10.6, బాబౌటా 9.9తో షాట్ కొట్టాడు. దీంతో మొత్తం స్కోరు 208.4 వద్ద అర్జున్ బాబౌటా పతక రేసు నుంచి ఔటయ్యాడు. ఆ తర్వాత చైనాకు చెందిన షెంగ్ లిహావో ఒలింపిక్ రికార్డు స్కోరు 252.2తో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్వీడన్‌కు చెందిన విక్టర్ లిండ్‌గ్రెన్ 251.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. క్రొయేషియా ఆటగాడు మారిచిచ్ మిరాన్ 230 స్కోరుతో కాంస్య పతకాన్ని సాధించాడు.
అర్జున్ క్వాలిఫికేషన్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. ఎనిమిది మంది షూటర్లలో ఫైనల్‌కు చేరుకున్నాడు. 25 ఏళ్ల బాబౌటా 105.7, 104.9, 105.5, 105.4, 104.0, 104.6 పాయింట్ల సిరీస్‌తో క్వాలిఫికేషన్‌లో మొత్తం 630.1 పాయింట్లు సాధించాడు. పంజాబ్‌కు చెందిన అర్జున్‌కు మొదట్లో షూటింగ్‌పై అవగాహన లేకపోయినా క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. అర్జున్‌కు క్రీడల పట్ల ఉన్న మక్కువ చూసి అతని తండ్రి నీరజ్ బాబౌటా ఒలింపిక్ పతక విజేత షూటర్ అభినవ్ బింద్రా వద్దకు చేరుకున్నాడు. బింద్రా 2013లో అర్జున్‌ని తన కోచ్ కల్నల్ JS ధిల్లాన్‌కి పరిచయం చేశాడు. అతడు రైఫిల్ షూటింగ్‌లో కొనసాగమని సలహా ఇచ్చాడు. ధిల్లాన్ సలహా మేరకు అర్జున్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో శిక్షణ ప్రారంభించాడు. ఫలితంగా 2013లో చండీగఢ్ స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ తొలి పతకాన్ని సాధించాడు.
అర్జున్ ఒక మధ్యతరగతి కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చాడు. పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న పంజాబ్‌లోని జలాలాబాద్‌లో అతని ఇల్లు ఉంది. అతడు తన ప్రారంభ విద్యను తన స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. ఈ తర్వాత తండ్రి ఉద్యోగం కారణంగా చండీగఢ్‌కు మారాడు. అర్జున్ తండ్రి ఇండియన్ రైల్వేలో ఉన్నారు. అర్జున్ చండీగఢ్‌లో బీఏ ఆనర్స్ డిగ్రీని పొందాడు.