33 మ్యాచ్‌ల్లో 426 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.. వేలంలో రూ.13 కోట్లు ప‌లుకుతాడ‌ని అంటున్న అశ్విన్‌.!

భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాబోయే ఐపీఎల్‌-2024 వేలం గురించి పెద్ద అంచ‌నా వేశాడు.

By Medi Samrat  Published on  28 Nov 2023 12:14 PM GMT
33 మ్యాచ్‌ల్లో 426 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.. వేలంలో రూ.13 కోట్లు ప‌లుకుతాడ‌ని అంటున్న అశ్విన్‌.!

భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాబోయే ఐపీఎల్‌-2024 వేలం గురించి పెద్ద అంచ‌నా వేశాడు. అశ్విన్ త‌మిళ‌నాడు బ్యాట్స్‌మెన్ షారుక్ ఖాన్ మరోసారి వేలంలో భారీ ధరను పొందే అవ‌కాశం ఉంద‌ని అంటున్నాడు. 2022 వేలంలో షారుక్ ఖాన్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.9 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది. అయితే జట్టు అంచనాలను అందుకోలేకపోవ‌డంతో అత‌డిని వ‌దులుకుంది. దీంతో ఐపీఎల్-2024 వేలంలో అత‌డికి భారీ ధ‌ర ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని అశ్విన్ భావిస్తున్నాడు.

ఐపీఎల్‌లో షారుక్ ఖాన్ ఇప్పటి వరకు మొత్తం 33 మ్యాచ్‌లు ఆడాడు. 31 ఇన్నింగ్స్‌లలో 20.29 సగటుతో 426 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో షారుక్ ఖాన్ స్ట్రైక్ రేట్ 134.81. అత్యుత్తమ వ్య‌క్తిగ‌త స్కోరు 47 పరుగులు మాత్ర‌మే. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 26 ఫోర్లు, 28 సిక్సర్లు బాదాడు.

దేశవాళీ క్రికెట్‌లో షారుక్‌తో కలిసి ఆడిన‌ అశ్విన్ అతనిపై గ‌ట్టి విశ్వాసంతో ఉన్నాడు. మరోసారి షారుక్ పై కాసుల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నాడు. అశ్విన్ ప్రకారం.. అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోటీ ప‌డ‌నున్నాయ‌ట‌.

యూట్యూబ్ ఛానెల్‌లో సంభాషణలో అశ్విన్.. 'షారుక్ ఖాన్ కోసం సీఎస్‌కే, గుజ‌రాత్ టైటాన్స్‌ మధ్య యుద్ధం జరగడం నేను ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే రాబోయే సీజన్‌కు ముందు గుజరాత్ తన అనుభవజ్ఞుడైన మిడిల్ ఆర్డర్ ఫినిషర్ హార్దిక్ పాండ్యాను కోల్పోయింది. అటువంటి పరిస్థితిలో వారికి పవర్ ప్లేయర్ అవసరం. షారుక్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ తొమ్మిది కోట్లకు కొనుగోలు చేసింది. అతడు జట్టులో తన నైపుణ్యాన్ని చాలా బాగా చూపించాడని అనుకుంటున్నాను. వేలానికి వెళ్తే మాత్రం.. అతడు మళ్ళీ దాదాపు 12 లేదా 13 కోట్ల ధ‌ర ప‌లుకుతాడు అని పేర్కొన్నాడు.

ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా రాబోయే వేలంలో షారుక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి మిచెల్ స్టార్క్‌ను వదులుకోవచ్చని అనుభవజ్ఞుడైన అశ్విన్‌ నొక్కి చెప్పాడు. సీఎస్‌కేలో ప్రస్తుతం జట్టులో స్థానిక ఆటగాడు ఎవరూ లేరు. దీంతో వేలంలో సీఎస్‌కే షారుక్ కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నాడు.

Next Story