ఇంగ్లండ్ లో సిరీస్ ఆడుతున్న భారతజట్టు ఓ వైపు ఘన విజయాలను నమోదు చేసుకుంటూ దూసుకుపోతూ ఉంటే మరోవైపు కరోనా టెన్షన్ వెంటాడుతూ ఉంది. ఇప్పటికే టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా బారినపడ్డారు. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు.
ఇప్పుడు టీమిండియా సహాయక బృందంలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. దీంతో టీమిండియా క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. శుక్రవారం ఇంగ్లండ్ తో ప్రారంభయ్యే చివరిదైన ఐదో టెస్టులో కోహ్లీ సేన నేరుగా బరిలో దిగనుంది. తాజా కరోనా కలకలం నేపథ్యంలో టీమిండియా సభ్యులందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. టూర్ ముగిసే ముందు ఇంకెంత మందికి కరోనా పాజిటివ్ వస్తుందోనని అభిమానులు భయపడుతూ ఉన్నారు.
చివరి టెస్ట్ కోసం 16 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. వ్యక్తిగత కారణాల చేత ఓవల్ టెస్ట్‌కు దూరమైన వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్ తిరిగి జట్టులోకి రాగా, సామ్ బిల్లింగ్స్‌పై వేటు పడింది. ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ 157 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓటమి పాలైంది. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలో నిలిచింది.