Cricket : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-3.. ఎప్ప‌టినుంచి స్టార్ట్ అవుతుందంటే..

స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ జూన్ 30 నుంచి జూలై 13 వరకు జరగనుంది

By Medi Samrat  Published on  17 May 2024 7:45 AM GMT
Cricket : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-3.. ఎప్ప‌టినుంచి స్టార్ట్ అవుతుందంటే..

స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ జూన్ 30 నుంచి జూలై 13 వరకు జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తరహాలో రూపొందించబడిన ఈ పోటీలో ఆరు జట్లు బ‌రిలో నిలుస్తాయి.

ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-3కి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు. ఎంపిక చేసిన పూల్ నుండి ప్రతి ఫ్రాంచైజీ ఒకరిద్దరు ఆటగాళ్లను తీసుకుని కొత్త క్రికెటర్లకు అవకాశం కల్పించేందుకు ‘ఏపీఎల్ రైజింగ్ స్టార్’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇది క్రికెటర్ల కెరీర్‌ను మెరుగుపరుస్తుందని.. వారికి విలువైన ఎక్స్‌పోజర్‌ను అందిస్తుందని ఆయన అన్నారు. APL తెలుగు ఫీడ్‌తో సహా స్టార్ స్పోర్ట్స్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రసారం కానుంద‌ని తెలిపారు. APL వేలం ప్ర‌క్రియ‌కు స‌న్నాహ‌కాలు జ‌రుగుతుండ‌గా.. 452 మంది ఆటగాళ్లు పాల్గొననున్నార‌ని తెలిపారు.

ఆటగాళ్ళు వారి ఆట‌తీరు, అనుభవం ఆధారంగా A, B, C - మూడు గ్రూపులుగా వర్గీకరించబడ్డారు. వేలంలో ఎంపికైన ఆటగాళ్లు కనీసం రూ. 25,000 నుండి గ‌రిష్టంగా రూ. 1 లక్ష వ‌ర‌కూ అందుకోనున్నారు. మరికొందరు మరింత సంపాదించే అవకాశం ఉంది. APL బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)తో ఒప్పందం చేసుకున్న సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన స్పోర్ట్స్ మెకానిక్‌తో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్ ఆటగాళ్ల గురించి వారి గత చరిత్ర, ప్రతిభ, గణాంకాలతో సహా సవివరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది వేలం సమయంలో ఫ్రాంచైజీలు సమాచార నిర్ణయాలు తీసుకోవడం సులభం చేస్తుంది. స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించేందుకు సంఘం కట్టుబడి ఉందని గోపీనాథ్ రెడ్డి ఉద్ఘాటించారు. APL అనేది నాన్ కమర్షియల్ వెంచర్ అని.. BCCIకి చెందిన అవినీతి నిరోధక బృందం అన్ని లావాదేవీలను పర్యవేక్షిస్తుందన్నారు.

Next Story