అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పూర్తయింది. ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ను నెగ్గలేకపోయింది.
By Medi Samrat Published on 30 May 2024 12:45 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పూర్తయింది. ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ను నెగ్గలేకపోయింది. అయితే ఆర్సీబీ, విరాట్ కోహ్లీ గురించి అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ, ఆర్సీబీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అక్కడితో ఆగని కొందరు అంబటి రాయుడు కుటుంబాన్ని అంతం చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రీ-మ్యాచ్ షో సందర్భంగా కోహ్లీ గురించి రాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలవాలంటే ఆరెంజ్ క్యాప్ ఒక్కరి సాధిస్తే సరిపోదని.. ఇతర బ్యాటర్లు 300 పరుగులు సాధించి సహకారం అందించాలని అన్నారు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజం, లెజెండ్ జట్టులో ఉన్నాడంటే.. అతను నిజంగా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతాడని.. తన స్థాయికి తగ్గట్టుగా రాణించాలని కోరుకుంటాడని స్టార్ స్పోర్ట్స్‌లో రాయుడు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై కొందరు నొచ్చుకున్నారు. దీంతో రాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.
రాయుడు భార్య, పిల్లలను బెదిరించడం, ఆన్ లైన్ లో బూతులు తిట్టడం మొదలు పెట్టారు. రాయుడు స్నేహితుడు సామ్ పాల్.. అభిమానులు ప్రవర్తనను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. రాయుడు భార్య విద్య, వారి పిల్లలను చంపేస్తామని బెదిరించడమే కాకుండా వ్యక్తిగత దూషణలకు గురిచేశారని చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవ్యవస్థ ఈ పరిస్థితిని గుర్తించాలని సామ్ పాల్ కోరారు. ఈ పరిస్థితి సోషల్ మీడియా చీకటి కోణాన్ని బయట పెడుతూ ఉంది. రాయుడు వ్యాఖ్యలు అతని దృక్పథం తప్ప మరేమీ కానప్పటికీ, అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడాన్ని ఎంత మాత్రం సమంజసం కాదు.