ఎవరీ అల్లా ఘజన్‌ఫర్..? ఆ మ్యాచ్ తర్వాత హాట్ టాఫిక్ అయ్యాడు..!
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ దాటికి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డ్‌ర్ కుప్పకూలింది.
By Kalasani Durgapraveen Published on 7 Nov 2024 11:43 AM IST
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ దాటికి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డ్‌ర్ కుప్పకూలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 18 ఏళ్ల అల్లా 6.3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్థాన్‌కు భారీ విజయాన్ని అందించాడు.
236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 120 పరుగుల స్కోరుతో పటిష్టంగా ఉండగా.. అఫ్ఘాన్ బౌలర్లు విధ్వంసం సృష్టించడంతో తదుపరి 23 పరుగులకే బంగ్లాదేశ్ జట్టు కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ధ్వంసం చేసిన అల్లా గజన్‌ఫర్ గురించి చాలా చర్చ జరుగుతోంది. అల్లా గజన్‌ఫర్ ఎవరో తెలుసుకుందాం?
అల్లా ఘజన్‌ఫర్ మార్చి 20, 2006న ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మాత్ జిల్లాలో జన్మించాడు. 6 అడుగుల 2 అంగుళాల పొడవున్న అల్లా.. మొదట్లో ఫాస్ట్ బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. అయితే మాజీ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ దౌలత్ అహ్మద్జాయ్ అతనికి స్పిన్ బౌలింగ్‌కు పరిచయం చేయడంతో అతని కెరీర్ లో పెద్ద మార్పు వచ్చింది. ఘజన్‌ఫర్ ఆఫ్ స్పిన్నర్‌గా తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ప్రారంభించాడు. 2020 కోవిడ్-19 మహమ్మారి సమయంలో అల్లా క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. IPL 2023 వేలం సమయంలో ఘజన్‌ఫర్‌ని చేర్చారు. ఆ సంవత్సరం వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడు ఘజన్‌ఫర్. వేలంలో అతని బేస్ ధర రూ. 20 లక్షలు. ఆ సమయంలో అతనిని ఎవరూ కొనలేదు. కానీ 2024లో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు బదులుగా KKR అతనిని తమ జట్టులో చేర్చుకుంది. దీంతో అతని పేరు మార్మోగిపోయింది.
అఫ్గానిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 71 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ జట్టులో సగం మంది పెవిలియన్‌కు చేరుకున్నారు. మహ్మద్ నబీతో కలిసి కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ జట్టు బాధ్యతలు చేపట్టి జట్టు స్కోరు 200 దాటించారు. షాహిదీ 52 పరుగులు చేయగా.. నబీ 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్ఘనిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 235 పరుగులకు కుప్పకూలింది. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకు ఆలౌటైంది. అల్లా ఘజన్‌ఫర్ అద్భుత ప్రదర్శనతో తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది.