దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్ రైజర్ ఫ్రాంఛైజీకి బాగా కలిసొచ్చింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా రెండో టైటిల్ ను సొంతం చేసుకుంది. ఈ లీగ్ గతేడాది ప్రారంభం అయింది. తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి రెండో సారి కూడా కప్పును సొంతం చేసుకుంది. ఫైనల్ లో 89 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది.
మ్యాచ్ మొత్తం వన్ సైడ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (30 బంతుల్లో 56), అబెల్ (34 బంతుల్లో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. హెర్మెన్, కెప్టెన్ మార్‌క్రమ్ 42 పరుగులు చేశారు. డర్బన్ బౌలర్లలో కెప్టెన్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, రీస్ టాప్లీ ఒక్క వికెట్ తీశాడు. 205 పరుగుల ఛేజింగ్ లో 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది డర్బన్ . ఆ తర్వాత ఏ దశలోనూ డర్బన్ జట్టు కోలుకోలేదు. చివరకు 115 పరుగులకే కుప్పకూలింది. 89 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో జాన్సెన్ 5 వికెట్లు తీశాడు. డర్బన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న క్లాసేన్ డకౌట్ గా వెనుదిరిగాడు. బార్ట్‌మన్, వారెల్ తలా రెండు వికెట్లు, సిమన్ హార్మర్ ఒక వికెట్ తీశాడు.