దక్షిణాఫ్రికాతో భారత్ తొలి వన్డే నేడే.. కళ్లన్నీ కోహ్లీపైనే
All eyes on Virat Kohli the batter in ODI series.భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్‌కు రంగం సిద్దమైంది.
By తోట వంశీ కుమార్ Published on 19 Jan 2022 9:23 AM ISTభారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్‌కు రంగం సిద్దమైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం పార్ల్ వేదికగా తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. టెస్టు సిరీస్ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో సౌతాఫ్రికా బరిలోకి దిగుతుండగా.. కనీసం వన్డే సిరీస్‌ను అయినా దక్కించుకోవాలనే గట్టి పట్టుదలతో టీమ్ఇండియా పోరాడనుంది. ఇక కెప్టెన్సీ వదులుకున్న తరువాత విరాట్ కోహ్లీ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో అతడు ఎలా రాణిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా.. రెండేళ్లుగా మూడెంకల స్కోరు అందుకోని కోహ్లీ.. కనీసం ఈ సిరీస్‌లోనైనా శతకం చేసి విమర్శల నోరు మూయించాలని అతడి అభిమానులు అశిస్తున్నారు. ఇక హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరం కావడంతో కొత్త కెప్టెన్ రాహుల్ జట్టును ఎలా నడిపిస్తాడు అన్నది కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ ధావన్ కెరీర్‌కు కూడా చాలా కీలకం. ఈ సిరీస్‌లో రాణిస్తేనే జట్టులో అతడికి చోటు ఉంటుంది. లేకుంటే.. ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్ల రూపంలో ఇప్పటికే అతడు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు.
ఇక ఎప్పటిలాగే కోహ్లీ మూడో స్థానంలో రానుండగా.. నాలుగో స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌ల మధ్య తీవ్రమైన పోటి నెలకొంది. వీరిద్దరిలో జట్టు మేనేజ్‌మెంట్ తుది జట్టులో ఎవరికి చోటు ఇస్తుందో చూడాలి. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఆడనుండగా.. ఐపీఎల్ సంచలనం వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరగ్రేటం చేయనున్నాడు. అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని జట్టు బావిస్తోంది. బుమ్రా, భువనేశ్వర్, దీపక్ చాహర్ లు పేస్ బారాన్నిమోయనున్నారు.
టెస్టు సిరీస్ గెలిచిన ఉత్సాహంతో దక్షిణాఫ్రికా కూడా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మైంట్ ప్రకటించిన డికాక్.. వన్డేల కోసం పూర్తి సన్నద్దతతో వచ్చాడు. స్వదేశంలో ఆడుతుండడం దక్షిణాఫ్రికాకు కలిసి వచ్చేదే. పని భారం తగ్గించేందుకు రబడకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. టెస్టుల్లో అదరగొట్టిన మార్కో జాన్సెన్ వన్డేల్లో అరంగేట్రం చేయవచ్చు. ఈ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం అని చెబుతున్నారు. దీంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.