భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ చేసిన ఓవరాక్షన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత బ్యాటర్ గిల్ ను అవుట్ చేశాక వెళ్లు అన్నట్టుగా గిల్‌కు అబ్రార్ సంజ్ఞ చేశాడు. అలా చేయడాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తప్పుబట్టాడు. దేనికైనా సమయం, సందర్భం ఉండవా? అని మండిపడ్డాడు. జట్టు గెలుస్తున్న సందర్భంలో సంబరాలు చేసుకుంటే ఓ అర్థం ఉంటుంది, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్ పడితే సెలబ్రేషన్స్ ఏంటో అతనికే తెలియాలని అన్నారు.
గిల్‌ను అబ్రార్ ఔట్ చేసిన బంతి అద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అబ్రార్ సెలబ్రేషన్ మీదే తనకు అభ్యంతరమని వసీం అక్రమ్ అన్నారు. నాకు తెలిసినంతవరకు అతనికి చెప్పడానికి ఎవరూ లేరన్నారు. అబ్రార్ అహ్మద్ వ్యవహరించిన తీరు సరిగా లేదని, టెలివిజన్‌లో చూస్తున్నప్పుడు కూడా అలాగే అనిపించిందని, ఓడిపోయాక ఓవరాక్షన్‌ను అందరూ గుర్తించారని వసీం అక్రమ్ చెప్పుకొచ్చారు. ఆతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయంతో ఆ జట్టు ఇంటిముఖం పట్టింది. బంగ్లాదేశ్ పై కివీస్ విజయంతో ఆతిథ్య పాకిస్థాన్ కథ ముగిసింది. ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్ తో పాకిస్థాన్ తలపడనుంది.