మొన్న కోహ్లీ.. నేడు రోహిత్.. టీమిండియా క్రికెటర్లపై ఆస్ట్రేలియన్ మీడియా పిచ్చిరాతలు
భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా మీడియా రోహిత్ శర్మను టార్గెట్ చేసింది.
By Medi Samrat Published on 30 Dec 2024 4:45 PM ISTభారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా మీడియా రోహిత్ శర్మను టార్గెట్ చేసింది. హిట్‌మ్యాన్ పేలవమైన కెప్టెన్సీపై దాడి చేస్తూ.. ఆస్ట్రేలియాకు చెందిన 'ది వెస్ట్ ఆస్ట్రేలియన్' వార్తాపత్రిక రోహిత్‌ను 'కెప్టెన్ క్రై బేబీ' అని పిలిచి ఎగతాళి చేసింది. గతంలో కింగ్ కోహ్లీని 'క్లోన్' అని పిలిచింది.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌లో భారత ఆటగాళ్లు చాలా తప్పులు చేశారు. యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లను వదిలేశాడు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ అతనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మైదానంలోనే జైస్వాల్‌ను మందలించాడు. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, పాట్ కమిన్స్ క్యాచ్‌లను జైస్వాల్ వదిలేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ అతడిని తిట్టాడు. దీంతో ఆస్ట్రేలియన్ మీడియా రోహిత్ వైఖరిపై అతనికి కెప్టెన్ క్రై బేబీ అని పేరు పెట్టింది.
అంతేకాదు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ కూడా రోహిత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ.. భారత కెప్టెన్ రోహిత్ ప్రతిచర్య నాకు నచ్చలేదు. అతను ఉద్వేగానికి లోనయ్యాడు.. వికెట్లు కావాలని నేను అర్థం చేసుకున్నాను.. కానీ ప్రశాంతంగా ఉండి మద్దతు ఇవ్వాలి. యశస్వి క్యాచ్‌ను వదిలివేసిన తర్వాత అతనికి ఇప్పటికే బాధగా ఉండవచ్చని అన్నాడు.
గురువారం మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా కొత్త ఓపెనర్ సామ్ కాన్స్టాస్‌తో విరాట్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దీని తర్వాత ఆస్ట్రేలియన్ మీడియా కోహ్లిని టార్గెట్ చేస్తూ.. క్లోన్ అంటే జోకర్ అనే పదాన్ని ఉపయోగించింది. ఇది ఆస్ట్రేలియన్ మీడియా ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసింది. ఎందుకంటే తమ ఆటగాళ్లు చేసిన దుష్ప్రవర్తనపై ఆస్ట్రేలియన్ మీడియా ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. వారి ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఏమీ ప్రచురించలేదు.