మొన్న బ్యాట్ విసిరేశాడు.. ఇప్పుడేమో గ్రౌండ్ లో గొడవ.. ఏంటిది రషీద్

ట్రినిడాడ్‌లోని టరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ 2024 సెమీ-ఫైనల్ లో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ దక్షిణాఫ్రికా ఆటగాడు అన్రిచ్ నార్ట్జే తో గొడవ పెట్టుకున్నాడు.

By Medi Samrat  Published on  27 Jun 2024 5:47 AM GMT
మొన్న బ్యాట్ విసిరేశాడు.. ఇప్పుడేమో గ్రౌండ్ లో గొడవ.. ఏంటిది రషీద్

ట్రినిడాడ్‌లోని టరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ 2024 సెమీ-ఫైనల్ లో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ దక్షిణాఫ్రికా ఆటగాడు అన్రిచ్ నార్ట్జే తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏడో ఓవర్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ అవుట్ అవ్వడంతో రషీద్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ తర్వాత నార్ట్జే దూకుడుగా.. ఆఫ్ఘన్ కెప్టెన్‌కి బౌన్సర్‌తో స్వాగతం పలికాడు. నోర్ట్జే అక్కడితో ఆగలేదు.. రషీద్‌ ను కొన్ని మాటలు అనడంతో రషీద్ మైదానంలోని అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాతి బంతికే నార్ట్జే మళ్లీ రషీద్ ఖాన్ ను స్లెడ్జ్ చేశాడు. దీంతో గొడవ కాస్తా పెద్దదైంది. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు సర్ది చెప్పడంతో అప్పుడు గొడవ సద్దుమణిగింది. ఈ మ్యాచ్ లో నార్ట్జే 3-0-7-2తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అంతకు ముందు మ్యాచ్ లో రషీద్ ఖాన్ బ్యాట్ విసిరేసిన సంగతి మరిచిపోక ముందే సెమీస్ మ్యాచ్ లో గొడవ పెట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 11.5 ఓవర్లలో 10 వికెట్లకు 56 పరుగులు చేసింది. ఇది T20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోరు కావ‌డం విశేషం. దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి.. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు ఇప్పటి వరకు అజేయంగా ఉన్నాయి. భారత జట్టు సెమీస్ లో ఇంగ్లండ్ తో తలపడనుంది.

Next Story