మ్యాచ్ రద్దు.. 91 సంవత్సరాల భార‌త‌ టెస్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి..!

ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ మధ్య గ్రేటర్ నోయిడా టెస్టు ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే రద్దయింది

By Medi Samrat  Published on  13 Sep 2024 5:07 AM GMT
మ్యాచ్ రద్దు.. 91 సంవత్సరాల భార‌త‌ టెస్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి..!

ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ మధ్య గ్రేటర్ నోయిడా టెస్టు ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే రద్దయింది. శుక్రవారం కూడా ఒక్క బంతి కూడా ప‌డ‌లేదు. అస‌లు ఈ టెస్టులో టాస్ కూడా వేయలేదు. ఈరోజు భారీ వర్షం కారణంగా చివరి రోజు ఆటను రద్దు చేస్తూ తెల్లవారుజామున నిర్ణయం తీసుకున్నారు. 1933 నుండి భారతదేశంలో టెస్టులు జ‌రుగుతున్నాయి. భారత గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్ టాస్ లేకుండా.. బాల్ ప‌డ‌కుండా రద్దు అవ‌డం ఇదే మొదటిసారి. అంతకుముందు ఆసియా ఖండంలో ఒక‌ మ్యాచ్ కూడా బంతి వేయకుండానే రద్దయింది. 1998లో ఫైసలాబాద్‌లో పాకిస్థాన్, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. మొత్తంమీద ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఏడు టెస్టులు ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయ్యాయి.

ఐదు రోజుల పాటు జ‌రిగి టెస్టు మ్యాచ్‌లో ఒక్క బంతి ఆట‌కు కూడా సాధ్య‌ప‌డ‌లేదు. మొదటి రెండు రోజులలో అవుట్‌ఫీల్డ్ తడిగా ఉంది. వర్షం కారణంగా తర్వాతి మూడు రోజులు ఆట జరగలేదు. టెస్టు క్రికెట్ చరిత్రలో బంతి వేయకుండానే మ్యాచ్ రద్దు కావడం ఇది ఎనిమిదో సారి. గ‌డిచిన 26 ఏళ్ల తర్వాత ఇదే మొద‌టిది. చివరిసారిగా 1998లో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ బంతి కూడా వేయకుండానే ముగిసింది. మొదటిసారి 1890లో ఇలా జరిగింది.

న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడేందుకు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. న్యూజిలాండ్ పెద్ద జట్టు. ఈ కారణంగా బోర్డుతో పాటు ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు, అయితే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు గ్రేటర్ నోయిడాలోని అంతర్జాతీయ స్టేడియంను ఎంచుకోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తోంది. రెండు దేశాల మధ్య టెస్టు చరిత్రలో 2,549వ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఒక్క బంతి ఆట కూడా సాధ్యం కాలేదు.

2017లో ICC నుండి టెస్ట్ జట్టు హోదా పొందిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ కు ఇది 10వ టెస్టు. ఈ టెస్టు ICC ప్రపంచ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగం కాదు. న్యూజిలాండ్ జట్టు త‌ర్వాత‌ శ్రీలంకలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది, ఆ తర్వాత అక్టోబర్ 16 నుంచి భారత్‌లో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.

ఆఫ్ఘనిస్తాన్ బోర్డు గ్రేటర్ నోయిడాతో పాటు కాన్పూర్, బెంగళూరు స్టేడియాల‌ను ఎంచుకుంది. అయితే ఢిల్లీ, కాబూల్ సమీపంలో ఉన్నందున.. గ్రేటర్ నోయిడాను ఎంపిక చేసింది. ఇంతకుముందు కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇక్కడ ఆడింది. ఆ అనుభ‌వం క‌లిసి వస్తుందని ఆశించిన ఏసీబీ ఇప్పుడు పశ్చాత్తాపపడుతోంది. అయితే ఏసీబీ చాలా ప్రయత్నాలు చేసింది.చివరి క్షణంలో మ్యాచ్‌ను మరో చోటికి తరలించే ప్రయత్నం చేసినా.. ఎక్కువ సమయం మిగిలి లేదు. అదే సమయంలో బీసీసీఐ సాయంతో ఢిల్లీ నుంచి క్యూరేటర్‌ని కూడా పిలిపించారు. కానీ విజయవంతం కాలేదు.

Next Story