అఫ్గానిస్తాన్‌ను వదలని వరుణుడు.. ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దు
Afghanistan vs Ireland match abandoned due to rain.టి20 ప్రపంచకప్ 2022 టోర్నిని వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2022 2:29 PM ISTఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్ 2022 టోర్నిని వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా నేడు మరో మ్యాచ్ రద్దు అయ్యింది. ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. అంతకముందు అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ ల మధ్య మెల్‌బోర్న్‌లో జరగాల్సిన మ్యాచ్ కూడా వరుణుడి కారణంగానే రద్దు అయిన సంగతి తెలిసిందే.
తాజాగా అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా ఆడలేకపోయింది. గ్రూప్-1లో ఉన్న అఫ్గాన్.. మొత్తంగా మూడు మ్యాచుల్లో రెండు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఓ ఓటమి, రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. ఇదే గ్రూప్‌లో ఉన్న ఐర్లాండ్ ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దుతో మూడు పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక ఇదే గ్రూప్‌లో ఉన్న న్యూజిలాండ్ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండు మ్యాచ్ ఆడిన కివీస్ ఒక మ్యాచ్ లో గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
గ్రూప్-2లో భారత్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి 4 పాయింట్లతో ఉంది. దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. 3 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో జింబాబ్వే, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నెదర్లాండ్స్ ఉన్నాయి.