T20 ప్రపంచ కప్‌కు జట్టును ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 కోసం తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.
By - Medi Samrat |
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 కోసం తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించింది సెలక్షన్ కమిటీ. T20 ప్రపంచ కప్ 2026కు భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్నాయి. 7 ఫిబ్రవరి నుండి 8 మార్చి 2026 వరకు T20 ప్రపంచ కప్ జరుగనుంది. ఈసారి కూడా ఈ పెద్ద టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన బలమైన ప్రదర్శనను ప్రదర్శించాలనుకుంటోంది.
అనుభవజ్ఞులైన ఆల్-రౌండర్ గుల్బాదిన్ నైబ్, ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ ఆఫ్ఘనిస్తాన్ 15 మంది సభ్యుల జట్టులోకి తిరిగి వచ్చారు. ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా కొంతకాలం అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉండగా, ఇప్పుడు జట్టులో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ముఖ్యంగా నవీన్ తిరిగి రావడంపై టీమ్ మేనేజ్‌మెంట్, అభిమానుల అంచనాలు పెరిగాయి. ఎందుకంటే అతను హై-ప్రెజర్ గేమ్‌లలో కీలక పాత్ర పోషించ గల నైపుణ్యం ఉన్న ఆటగాడు.
రషీద్ సారథ్యంలో అఫ్గానిస్థాన్ జట్టు గత టీ20 ప్రపంచకప్ (2024)లో మంచి ప్రదర్శన కనబరిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈసారి కూడా అదే ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను ఆఫ్ఘనిస్తాన్ జట్టులో చేర్చారు. ఇందులో ఏఎమ్ ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ పేర్లు ఉన్నాయి.
T20 ప్రపంచ కప్ 2026కి ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌ను ఆడవలసి ఉంది. ఇది జనవరి 19 నుండి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ జనవరి 22 న జరుగుతుంది. ఈ సిరీస్‌కు కూడా ఇదే జట్టును ఎంపిక చేశారు.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు
రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్ (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), సెడిఖుల్లా అతల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఉమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫారూకీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.
రిజర్వ్ ఆటగాళ్లు : AM ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ.