న్యూజిలాండ్ పై సంచలన విజయం నమోదు చేసిన ఆఫ్ఘనిస్థాన్

టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్థాన్ ఊహించని షాక్ ఇచ్చింది. హోరా హోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ జట్టు శాసించింది

By Medi Samrat  Published on  8 Jun 2024 6:00 AM GMT
న్యూజిలాండ్ పై సంచలన విజయం నమోదు చేసిన ఆఫ్ఘనిస్థాన్

టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్థాన్ ఊహించని షాక్ ఇచ్చింది. హోరా హోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ జట్టు శాసించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 159 పరుగులు చేయగా.. ఛేజింగ్ లో కివీస్ దారుణంగా ఓటమిపాలైంది. 75 పరుగులకే న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 84 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘన్ ఓపెనర్లు గుర్భాజ్, ఇబ్రహీం జాద్రాన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 103 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. గుర్భాజ్ 80 పరుగులు చేయగా, జాద్రాన్ 44 పరుగులు చేశాడు. ఇక అజమ్తుల్లా 22 పరుగులు చేశాడు. అయితే ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘన్. భారీ స్కోరును చేయలేకపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, మ్యాట్ హెన్రీ చెరో రెండు వికెట్లు తీశారు.

ఇక ఛేజింగ్ లో న్యూజిలాండ్ కు మొదటి బంతికే షాక్ ఇచ్చింది ఆఫ్ఘన్. ఫిన్ ఆలెన్ ను మొదటి బంతికే ఫజల్ హాక్ ఫరూఖీ పెవిలియన్ కు పంపాడు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లుగానే పెవిలియన్ చేరుతూ వెళ్లారు. ఆఫ్ఘన్ స్పిన్నర్లను కనీసం అంచనా వేయలేకపోయారు కివీస్ బ్యాటర్లు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో గ్లెన్ ఫిలిప్స్ చేసిన 18 పరుగులే అత్యధిక స్కోరు. మ్యాట్ హెన్రీ ఆఖర్లో 12 పరుగులు చేశాడు. ఇక మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 15.2 ఓవర్లకు న్యూజిలాండ్ పోరాటం 75 పరుగులకు ముగిసింది. ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ 4 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు.

Next Story