పాక్‌తో ఫైనల్‌కు ముందు టెన్షన్.. అభిషేక్, హార్దిక్ గాయాలపై తాజా అప్‌డేట్..!
ఆసియా కప్ 2025లో శుక్రవారం జరిగిన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సూపర్ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది.
By - Medi Samrat |
ఆసియా కప్ 2025లో శుక్రవారం జరిగిన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సూపర్ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత జట్టు టోర్నీలో వరుస విజయాల పరంపరను కొనసాగించింది. భారత్ శ్రీలంకను ఓడించి ఉండవచ్చు కానీ గాయాలు జట్టులో టెన్షన్‌ను పెంచాయి. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ గాయపడి మైదానాన్ని వీడారు. ఈ ఇద్దరు స్టార్లు పాకిస్థాన్‌తో ఫైనల్‌లో ఆడడం తప్పనిసరి.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మల గాయాలపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజా సమాచారం అందించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బౌలింగ్ కోచ్ మీడియాతో మాట్లాడుతూ.. అభిషేక్ క్షేమంగా ఉన్నాడని, హార్దిక్‌ను శనివారం పరీక్షిస్తామన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు గాయాల నొప్పి కారణంగా మైదానం వీడాల్సి వచ్చిందని చెప్పాడు.
హార్దిక్ తన ఎడమ స్నాయువు గాయంతో పోరాడుతున్నట్లు కనిపించాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ వేసిన తర్వాత అతడు మైదానం నుంచి వెళ్లిపోయాడు. హార్దిక్ తన తొలి ఓవర్‌లోనే కుసాల్ మెండిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. మెండిస్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. తొలి ఓవర్ ముగిసిన తర్వాత హార్దిక్ బయటకు వెళ్లి మళ్లీ మైదానంలోకి రాలేదు.
మరోవైపు తొమ్మిదో ఓవర్లో అభిషేక్ శర్మ కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపించాడు. నడుస్తున్నప్పుడు కుడి తొడ పట్టుకుని కనిపించాడు. చివరకు పదో ఓవర్‌లో మైదానం వీడాల్సి వచ్చింది.
మోర్నీ మోర్కెల్ విలేకరులతో మాట్లాడుతూ.. "మ్యాచ్ సమయంలో వారిద్దరూ నొప్పితో బాధపడ్డారు. మేము ఈ రాత్రి, రేపు ఉదయం హార్దిక్‌ను చూస్తాము, ఆపై నిర్ణయం తీసుకుంటాము. అభిషేక్ బాగానే ఉన్నాడు.. పాకిస్థాన్‌తో జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్‌కు ఒక రోజు ముందు శనివారం భారత్‌కు ఎలాంటి శిక్షణా సెషన్ ఉండదని మోర్కెల్ వెల్లడించారు. ప్రతి ఆటగాడు బాగా విశ్రాంతి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటుందని చెప్పాడు.
మోర్కెల్ ఇలా అన్నాడు.. "ఆటగాళ్ళకు విశ్రాంతి చాలా ముఖ్యమైన విషయం. మ్యాచ్ ముగిసిన వెంటనే వారు అలసట నుంచి కోలుకోవడం ప్రారంభమైంది. అలసట తీరడానికి ఉత్తమ మార్గం నిద్ర, విశ్రాంతి. రాత్రిపూట వారు మంచి నిద్రపోతారని ఆశిస్తున్నాము."