ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆట‌గాడు..!

21 ఏళ్ల సమీర్ రిజ్వీ దేశవాళీ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.

By Medi Samrat  Published on  21 Dec 2024 3:07 PM GMT
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆట‌గాడు..!

21 ఏళ్ల సమీర్ రిజ్వీ దేశవాళీ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. త్రిపురతో జరిగిన పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉన్న రిజ్వీ కేవలం 97 బంతుల్లో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రిజ్వీ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 20 భారీ సిక్సర్లు ఉన్నాయి. రిజ్వీ దూకుడుగా ఆడి త్రిపుర బౌలర్లను చిత్తు చేశాడు.

రిజ్వీ 23వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ఒంటరిగా తన జట్టును 405 పరుగుల భారీ స్కోరు వద్దకు తీసుకెళ్లాడు. ఈ అద్భుతమైన ఫీట్ లిస్ట్ ఎ రికార్డుగా అర్హత సాధించనప్పటికీ.. రిజ్వీ ఇన్నింగ్స్ అసాధారణమైనది. అయితే ఐపీఎల్ 2025కి ముందు మాత్రం తన ప్రతిభను ప్రదర్శించాడు.

అంతకుముందు లిస్ట్ ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన చాడ్ బోవ్స్ పేరిట ఉంది. చాడ్ బోవ్స్ 107 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. త‌ద్వారా చాడ్ బోవ్స్ భారత ఆటగాడు నారాయణ్ జగదీషన్, ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ ఉమ్మడి రికార్డును బద్దలు కొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ, మార్ష్ కప్ సమయంలో జగదీష‌న్, హెడ్ ఇద్దరూ వరుసగా 114 బంతుల్లో ఈ ఫీట్ సాధించారు.

ఇదిలావుంటే.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సమీర్ రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.95 లక్షలకు కొనుగోలు చేయడం గమనార్హం. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే రిజ్వీ ఐదు ఇన్నింగ్స్‌లలో 118.60 స్ట్రైక్ రేట్‌తో కేవలం 51 పరుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు.

Next Story