భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్స్ కనిపించాయి. భారత్ లోకి ప్రవేశించడానికి అవి ప్రయత్నాలు చేయడంతో భారత ఆర్మీ వాటిపై ఫైరింగ్ చేసింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని కసోవాల్ ప్రాంతంలో భారత్, పాకిస్థాన్ దేశాల అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ కనిపించిందని అధికారులు తెలిపారు. సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) దళాలు శనివారం రాత్రి కాల్పులు జరపడంతో డ్రోన్ తిరిగి పాకిస్థాన్ కు వెళ్లినట్లు వారు తెలిపారు. BSF సిబ్బంది డ్రోన్‌పై కనీసం 96 రౌండ్లు కాల్పులు జరిపారని.. ఐదు ఇల్యూమినేషన్ బాంబులను కూడా ఉపయోగించారని.. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు.
శనివారం రాత్రి 11:46 గంటల సమయంలో అమృత్‌సర్ జిల్లాలోని చన్నా పటాన్ ప్రాంతంలో మరో డ్రోన్ కనిపించిందని అధికారులు తెలిపారు. బీఎస్ఎఫ్ దళాలు 10 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్ వెనక్కి వెళ్లిపోయింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వారు తెలిపారు. భారత్-పాక్ సరిహద్దుల్లో డ్రోన్స్ సహాయంతో డ్రగ్స్, మత్తుపదార్థాలను భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు భారత ఆర్మీ వాటిని తిప్పికొడుతూ వస్తోంది.