ఇదేం బాదుడు.. సీఎస్‌కే వదులుకున్నది ఈ ఆటగాడినా..?
ప్రతిభకు, వయసుకు సంబంధం లేదని అంటారు. టాలెంట్ ఉంటే చిన్నవయసులోనే అత్యుత్తమంగా రాణించవచ్చు.
By Medi Samrat Published on 31 Dec 2024 2:44 PM ISTప్రతిభకు, వయసుకు సంబంధం లేదని అంటారు. టాలెంట్ ఉంటే చిన్నవయసులోనే అత్యుత్తమంగా రాణించవచ్చు. తాజాగా 17 ఏళ్ల ముంబై క్రికెటర్ ఈ విషయాన్ని నిరూపించాడు. ముంబై జట్టుకు చెదిన 17 ఏళ్ల ఆయుష్ మ్హత్రే బ్యాట్‌తో భారీ ఇన్నింగ్సు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో నాగాలాండ్‌పై ఆయుష్ మ్హత్రే బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. తద్వారా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అతడు తన లిస్ట్-ఎ కెరీర్ మొదటి సెంచరీని నమోదు చేశాడు.
2024 సంవత్సరం చివరి రోజు అయిన డిసెంబర్ 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై, నాగాలాండ్ (ముంబై vs నాగాలాండ్) జట్ల మధ్య విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఇన్నింగ్స్‌ను ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ ప్రారంభించారు. వీరిద్దరూ ముంబై జట్టుకు ఘనమైన ఆరంభాన్ని అందించారు. వారి మధ్య మొదటి వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. రఘువంశీ అవుటైనప్పటికీ ఆయుష్ మ్హత్రే దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆయుష్ 117 బంతులు ఎదుర్కొని 181 పరుగులు చేశాడు. తద్వారా 17 ఏళ్ల ఆయుష్ లిస్ట్-ఎ క్రికెట్‌లో తొలి సెంచరీ సాధించాడు. అయితే డబుల్ సెంచరీకి కేవలం 19 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఆయుష్ ఇన్నింగ్స్‌లో మొత్తం 11 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి.
ఆయుష్‌తో పాటు అంగ్క్రిష్ 56 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ 73 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. లిస్ట్-ఎ క్రికెట్‌లో ముంబై జట్టు సాధించిన రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం.
ఆయుష్ మ్హత్రే 2007లో జన్మించారు. అతడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. 2024 ఇరానీ కప్ సందర్భంగా మ్హత్రే ముంబై తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో అతడు రంజీ ట్రోఫీలో తన మొదటి ఫస్ట్ క్లాస్ సెంచరీని సాధించాడు. 17 ఏళ్ల ఆయుష్ చాలా తక్కువ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటివరకు అతడు ఫస్ట్ క్లాస్‌లో 6 మ్యాచ్‌లు ఆడి 441 పరుగులు చేశాడు, అయితే లిస్ట్-ఎ క్రికెట్‌లో 4 మ్యాచ్‌ల్లో 309 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా ఆయుష్ మ్హత్రేను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. వేలానికి ముందు ఆయుష్‌ను ట్రయల్స్ కోసం CSK పిలిచింది. ఈ 17 ఏళ్ల ఆటగాడు ధోని జట్టులోకి వస్తాడని భావించారు, కానీ అతడు వేలంలోకి వెళ్లగా ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. CSK కూడా అతనికి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లిస్ట్-ఎ క్రికెట్‌లో ఆయుష్ సెంచరీ ఇన్నింగ్స్‌ను చూసిన ఫ్రాంచైజీలన్నీ అతడిని తిరస్కరించినందుకు చింతిస్తున్నాయి.