పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్.. కేరాఫ్ కారాగారమేనా..!
Police lodge FIR against Babar Azam after sexual exploitation complaint. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ కటకటాల పాలు కాబోతున్నాడా.
By న్యూస్‌మీటర్ తెలుగు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ కటకటాల పాలు కాబోతున్నాడా..? ఎందుకంటే గత ఏడాది నవంబర్ లో బాబర్ ఆజామ్ మీద లాహోర్‌కు చెందిన హమీజా ముక్తార్ మీడియా సాక్షిగా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్ తనను మోసం చేయడమేగాక లైంగికంగా కూడా వేధించాడని తెలిపింది. బాబర్, నేను స్కూల్ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించడం.. ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అవ్వడంతో.. బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపణలు గుప్పించింది. ఓ సారి తనకు బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది.
పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో లాహోర్‌లోని అదనపు సెషన్స్ కోర్టు బాబర్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. హమీజా తరఫు న్యాయవాది అబార్షన్ కు సంబంధించిన వైద్య పత్రాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయూర్తి నోమన్ ముహమ్మద్ నయీమ్ బాబర్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా నసీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు. ఆరోపణలు తీవ్రంగా, కలవరపరిచే విధంగా ఉన్నాయని.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు న్యాయమూర్తులు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గతంలో హమీజా ఆరోపించింది. నసీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రికెటర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, వివాహ పునః భరోసాపై ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బాబర్ తనను బలవంతం చేశాడని కూడా హమీజా ఆరోపించింది. ఏది ఏమైనా బాబర్ పెద్ద చిక్కుల్లోనే పడ్డాడు.