అమ్మ మాట.. నాన్న బాట.!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  29 July 2020 6:53 AM GMT
అమ్మ మాట.. నాన్న బాట.!

సోనూసూద్‌.. గత నాలుగు నెలలుగా అందరి నోట్లో నానుతున్న పేరు. టాలీవుడ్, బాలీవుడ్‌ తెరపై ప్రతినాయకుడి పాత్రలో అత్యద్భుతంగా జీవించి.. ప్రేక్షకుల వళ్లు జలదçరింప చేసిన ఈ నటుడు.. నిజ జీవితంలో హీరోగా మారుతున్నాడు. మానవీయతకు, దానగుణానికి, మంచి మనసుకు మరోరూపంగా ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. తన చెవికి తాకిన, కంటికి ఆనిక ఏ బాధాతప్త సంఘటనైనా, అది ఎక్కడ జరిగినా వెంటనే నేనున్నానని స్పందిస్తున్నారు.

సోనుసూద్‌ అపర కుబేరుడేం కాదు. వారసత్వంగా వచ్చిపడిన లెక్కలేనంత సంపదేం లేదు. ఎగువ మధ్యతరగతికి చెందిన కుటుంబం నుంచి వచ్చాడు. మరి ఇంత దానగుణం ఎలా అబ్బింది అంటే.. చేయాలన్న మనసు ఉండటమే ప్రధానం. తనేం ఆకాశాన్ని నేలకు దించుతానని, రీల్‌ హీరోలా సూపర్‌మేన్‌లా గాల్లో ఎగురుకుంటూ వస్తానని గొప్పలు చెప్పడం లేదు. చెమటోడ్చి సంపాదించి కూడబెట్టుకున్న సొమ్ముతోనే సాయం అందిస్తున్నాడు. ఇంతకూ ఈ నయా కర్ణుడి గతమేంటి? ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? కుటుంబ సంగతులేంటి?

S4

సోనూసూద్‌ పంజాబ్‌ రాష్ట్రంలోని మోఘాలో 1973లో జన్మించాడు. పంజాబ్‌లో మోగ.. సూద్‌.. హందూ.. అనే పేర్లలో కొన్ని బ్రాహ్మణరుషులకు చెందినవి. కొన్నేమో వ్యాపారస్థులకు చెందుతాయి. సోనూ తండ్రి శక్తిసాగర్‌ సూద్‌ వస్త్రవ్యాపారి. తల్లి సరోజ ప్రొఫెసర్‌. ఇంటర్‌ పూర్తయ్యాక ఏ కోర్సులో జాయిన్‌ కావాలో అన్న మీమాంస తలెత్తింది. ఆ ఖాళీ సమయంలో షాపులో కూర్చొని తండ్రికి సాయం చేసేవాడు. ఆ సమయంలోనే ఉగ్రవాద గొడవలతో పంజాబ్‌ రాష్ట్రం అట్టుడుకుతోంది. నిత్యం అల్లర్లు, బంద్‌లు.. స్కూళ్ళు, కాలేజీలు తరచూ సెలవులు ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోనూసూద్‌ తమ వద్ద ఉండటం సరికాదని, తల్లిదండ్రులు నాగపూర్‌ లోని యశ్వంతరావు చవాన్‌ కళాశాలలో ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ చేర్పించారు.

S5

తల్లిదండ్రులు సోనూసూద్‌ను చిన్ననాటి నుంచే వాస్తవానికి దగ్గరగా పెంచడం వల్ల.. ప్యాకెట్‌ మనీ అంటూ వారిని అడగటం ఇష్టం లేక చిన్న చిన్న మోడలింగ్‌ చేస్తూ కాసింత డబ్బు సంపాదించేవాడు. 1996లో నాగపూర్‌లోనే ఎంబీయే చదువుతున్న తెలుగమ్మాయి సోనాలితో పరిచయం అయ్యింది. అది కాస్త పెళ్లి దాకా దారితీసింది. ఇరు కుటుంబాల అనుమతితో చక్కగా పెళ్ళి చేసుకున్నారు. సోనూసూద్‌కు నటనంటే అమితమైన ఆసక్తి.. కానీ సోనాలికి ఎందుకో సినీరంగంపై ఇష్టం లేదు.. కాదు నమ్మకం లేదు. రంగుల ప్రపంచంలో ఉండే వారికి లౌకిక ప్రపంచ ప్రామాణికాలు అంతగా పట్టవని ఆమె అభిప్రాయం. పైగా నటీనటుల్లో చాలామంది వైవాహిక జీవితాలు విఫలమైన ఘటనలు విన్న ఆమె ఇద్దరం ఇక్కడే ఉద్యోగం చేసుకుందాం.. అంటూ బ్రేక్‌ వేసింది. అర్ధాంగి మనసులో అలుముకున్న సందేహాల మబ్బుల్ని సోనూసూద్‌ పారదోలగలిగాడు. వృత్తి తప్ప ఇతరేతర విషయాలు ఆలోచించను, తలదూర్చనని వైవాహిక జీవితానికి ఇబ్బంది కలిగించనని మాట ఇచ్చాడు.

అలా ముంబై వెళ్లిన తను మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆరుగురున్న గదిలో చేరి సర్దుబాటుతో బతకడం ఎలాగో నేర్చుకున్నాడు. రోజూ ఉదయం జిమ్‌కెళ్ళి నేర్పించేవాడు. ఓ రోజు ఆర్గనైజర్‌ నుంచి ఫోన్‌. ఓ తమిళ నిర్మాతకు బాడీ బిల్డర్‌ కావాలంటా.. వెళ్లు అన్నాడు. రాత్రికి రాత్రే రైలులో చెన్నై వెళ్ళాడు. స్టూడియోకు వెళితే నిర్మాత.. ఏదీ చొక్కావిప్పి చూపించు అన్నాడు. సోనూసూద్‌ చాలా సంయమనంతో ఆ పని చేశాడు. నిర్మాతకు నచ్చాడు. తెరంగేట్రం చేసేశాడు. అప్పట్నుంచి సోనూసూద్‌ వెనుదిరిగి చూడలేదు. దక్షిణాదిలో ఎర్రగా బుర్రగా స్టైలిష్‌గా ఉండే సోనూసూద్‌ విలనిజం నచ్చేసింది. తమిళ ఇండస్త్రీ లో అవకాశాలు వస్తున్నాయి.. భాష తెలిస్తే మరింత బాగా నటించవ్చని సూచించిన తల్లి తమిళం నేర్చుకోవడం ఎలా పుస్తకం పంపింది.

S1

సోనూసూద్‌ సినీరంగంలో కుదురుకున్నాక భార్య సోనాలి ముంబైకి వచ్చేసింది. అక్కడే ఉద్యోగం వెదుక్కొంది. ఇద్దరు పిల్లలతో సాగుతున్న చక్కని కాపురం వారిది. భర్త చేతికి ఎముక లేకుండా దానం చేస్తున్నా పన్నెత్తు మాటనని సుగుణశీలి సొనాలి. సోనూసూద్‌లో ఈ సంస్కారాన్ని పాదుగొలిపింది తన తల్లే! చిన్ననాటి నుంచి సోనూసూద్‌కు మానవతా విలువలు గురించి తెలిపారు. అసహాయులకు ఎలా అండగా నిలవాలో నేర్పించారు.. సాటి వారిని కష్టాల్లో ఆదుకోవాలి, పెద్దవారిని గౌరవించాలి. జీవితం అర్థవంతంగా సాగేందుకు ఇవి మౌలిక సూత్రాలని తెలిపింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలిగా ఉంటున్న ఆమె తన కొడుకు జీవితం నైతికతతో సాగాలని ఆశించింది.. అశీర్వదించింది.. అదే బోధించింది. తల్లి తరచూ ఉత్తరాలు రాసేది. సోనూ సూద్‌ ఓసారి తన తల్లితో అమ్మా ఫోన్లు వచ్చాయి.. ఇంత ఆధునాతన కాలంలో ఇంకా ఉత్తరాలు రాయడం ఎందుకూ అని ప్రశ్నించాడు. అందుకు ఆమె నవ్వుతూ నేను ఉన్నంత కాలం మాట్లాడుతాను, తెలిసినవి చెబుతాను.. ఆ తర్వాత నా స్థానం ఖాళీ అయ్యాక.. ఈ ఉత్తరాలే నీకు జీవిత పాఠాలు చెబుతాయని తెలిపింది. వరి విత్తితే వరే పండుతుందన్నట్టు.. చిన్ననాడు తల్లి సోనూసూద్‌ మనోక్షేత్రంలో ఏ సంస్కార విత్తనాలు విత్తిందో అవే నేడు వృక్షాలుగా ఎదిగి పలువురికి నీడనందిస్తున్నాయి.

సోనూసూద్‌ వ్యక్తిత్వ నిర్మాణంలో తండ్రి పాత్ర పరోక్షంగా ఉంది. తండ్రి కూడా పంజాబ్‌లో అన్నదానం చేసేవాడు. ఆ దానగుణాన్నే వారసత్వంగా పుణికిపుచ్చుకున్నాడు సోనూసూద్‌. నటుడిగా తెలుగులో అరుంధతి సినిమాలో ప‌శుప‌తి, హిందీలో షాహిద్‌ సినిమాలో భగత్‌ సింగ్‌ పాత్రల‌ను అద్భుతంగా పోషించాడు. ఆ పాత్రలు సోనూసూద్‌కు మంచి పేరు తెచ్చాయి.

S2

నటుడిగా తన అలుపెరగని ప్రయాణం సాగిస్తున్న సోనూసూద్‌లోని మానవీయ మనీషిని ఈ కరోనావిలయం ఆవిష్కరించింది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో సోనూసూద్‌ నిరంతరం శ్రమించాడు. లాక్‌డౌన్‌ వేళ ముంభైలోని వలస కార్మికుల్ని సొంతూళ్లకు పంపడానికి ఎన్నో వాహనాలు సమకూర్చాడు. వారి కోసం మూడు రైళ్ళు తన సొమ్ముతో బుక్‌ చేశాడు. మెడికల్‌ విద్యార్థులు విదేశాల్లో చిక్కుకుపోతే ఏకంగా విమానం ఏర్పాటు చేశాడు.

ఓ బామ్మ నాల్గు మెతుకుల కోసం వీధుల్లో కర్రసాము చేస్తుంటే ఆమె కోసం ఓ కర్రసాము స్కూలే ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకున్నాడు. ఓ అమ్మాయికి చదువు కోసం తండ్రి తన ఉపాధిగా ఉంటున్న ఆవును అమ్మిన ఉదంతం విని చలించిపోయి ఆవు వారింటికి వచ్చేలా చేశాడు. కొలువు కోల్పోయిన ఓ బడుగు ఇంజనీరింగ్‌ విద్యార్థిని కాయగకూరల వ్యాపారానికి సిద్ధపడితే ఆమెకు అండగా నిలిచి కంపెనీలతో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చేస్తున్నాడు.

S3

చిత్తూరులోని మదనపల్లికి చెందిన ఓ పేదరైతు చేతిలో చిల్లిగవ్వ లేకుండా కన్నకూతుళ్లనే కాడెద్దులుగా మారిస్తే గంటల వ్యవధిలో ట్రాక్టర్‌ కొని వారింటికి పంపించాడు.. ఇలా చెబుతూ పోతే కొండవీటి చాంతాడంతవుతుంది. మీరు ఇలా సాయం చేస్తూ పోతే ప్రజలకు మీపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి. మరి ఎంతకాలం ఇలా కొనసాగిస్తారు అంటే.. ఆ భగవంతుడు నాకు శక్తి ప్రసాదించినంత కాలం కష్టాల్లో ఉన్నవారికి ఆదుకుంటూనే ఉంటాను అంటున్నాడు.

కరోనా కష్టకాలంలో బాధలే కాదు బంధాల విలువలు తెలిసొస్తున్నాయి. రక్తసంబంధాలను కూడా కాదనకునే స్వార్థం వికటాట్టహాసం చేస్తోంది. పుట్టిన వాడు గిట్టక తప్పదు.. అన్న దేవసూత్రాన్ని విస్మరించి, కలకాలం ఇక్కడే ఉండిపోతాము.. ఉండిపోవాలన్నంత వెర్రిగా బతికేస్తున్నారు కొందరు. తెల్లారి పత్రికల్లో వార్తలు చూస్తుంటే.. టీవీలు చూస్తుంటే.. వృద్ధాప్యంలో కరోనా విపత్తుతో మరణిస్తున్న వారు అందరూ ఉన్నా అనాథశవాల్లా మిగిలిపోతున్నారు.

ఇలాంటి ఘోరఘటనలు ఒకవైపు కలవరం పుట్టిస్తుంటే.. సోనూసూద్‌ సహాయయాగం ఈ వ్యవస్థపై కాసింత నమ్మకం పుట్టిస్తోంది. చీకటి వెలుగుల్లా.. సమాజంలో మంచీచెడు రెండూ ఉంటాయి. కానీ మంచిని చేతకానితనంగా మార్చిన చెడుపై సోనూసూద్‌ సాధిస్తున్న విజయాలే ఈ సంఘటనలు. మానవుడే మహనీయుడని ఓ కవి అన్నట్టు.. సోనూసూద్‌ సుగుణం వెయిరేకుల పద్మంలా వికసించాలని.. కష్టజీవులకు అండదండలు లభించాలని అందరూ ఆశిస్తున్నారు.

Next Story