తెలంగాణలోనికి ప్రవేశించిన నైఋతి రుతుపవనాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Jun 2020 12:25 PM GMTతెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలోనికి ఈరోజు నైఋతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, గోవా, కొంకన్, మధ్యమహారాష్ట్ర మరియు మరఠ్వాడ లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు ప్రవేశించాయి. అలాగే.. కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్రాలకు కూడా నైఋతి ఋతుపవనాలు ప్రవేశించాయి. దీంతో రాబోయే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది. ఇక రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల దగ్గర ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్ది నైఋతి వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దక్షిణ చత్తీస్ గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని కారణంగా మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీవర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ భారీ నుండి అతిభారీవర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.